- పదేండ్లు అధికారంలో ఉండి సోషల్ మీడియాను కంట్రోల్చేయలేదు
- సురేఖ ఫైర్ అని తెలిసి కూడా ఆమె జోలికి ఎందుకెళ్లారు?
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడి యాలో పెట్టిన అనుచిత కామెంట్లపై కేటీఆర్ స్పందించకపోగా రెచ్చగొట్టారని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ఆయన సోషల్‌మీడియాను కంట్రోల్చేయలేకపోయారన్నారు. గాంధీ భవన్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ ఫైర్ అని తెలిసి కూడా ఆమె జోలికి ఎందుకెళ్లారని ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ కు దండలు వేసిన ఆడవాళ్లను కూడా ఇలాగే చూస్తారా?’ అని నిలదీశారు. రాజకీయాల్లోకి ఇలాంటి సంస్కృతి తీసుకురావడం మంచిది కాదన్నారు. ‘పదేండ్లు రాజభోగాలు అనుభవించారు కదా? ఇంకో పదేండ్లు ఓపిక పట్టు కేటీఆర్’ అని అన్నారు. ప్రభుత్వంలో ఇంకా కొందరు అధికారులు బీఆర్ఎస్తో సోపతి చేస్తున్నారని, వాళ్లు తీరు మార్చుకోవాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ మంచి అధికారే తప్ప.. మంచి లీడర్కాదని, ఆయన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవాల్సినఅవసరం లేదన్నారు.
ఉనికి కోసమే బీజేపీ దీక్ష
ఉనికి కోసమే బీజేపీ నాయకులు రుణమాఫీపై దీక్ష చేశారని జగ్గారెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశామని, టెక్నికల్ సమస్య కారణంగా కొందరికి మాఫీ ఆగిందని చెప్పారు. ఇది తెలిసి కూడా బీజేపీ నాయకులు దీక్ష చేయడం సమంజసం కాదన్నారు. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, బీజేపీకి కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు.