పెట్రోల్, డీజిల్‌ను  జీఎస్టీలోకి తేవాల్సిందే..

పెట్రోల్, డీజిల్‌ను  జీఎస్టీలోకి తేవాల్సిందే..
  • పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తేవాల్సిందే..
  • లోకల్ సర్కిల్స్ సర్వేలో 77శాతం మంది ఓపీనియన్‌
  • పెట్రో రేట్ల పెంపుతో ఖర్చులు తగ్గిస్తున్నట్లు 51శాతం జనం వెల్లడి
  • నిత్యావసరాలు తగ్గించుకుంటున్నామన్న 21శాతం మంది 

హైదరాబాద్‌, వెలుగు: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిందే జనం అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేట్లు పెరగడంతో చేసేదేంలేక అనేక మంది ఖర్చులు తగ్గించుకుంటున్నారు. మరికొంత మంది నిత్యావసరాలు వాడకం కూడా తగ్గిస్తున్నారు. కొంత మంది ఏకంగా పెట్రోల్‌, డీజిల్‌ కోసం డబ్బులను పొదుపు చేసుకుంటున్నారు. ఇవే విషయాలను జనం లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడించారు. 2017 జూలైలో జీఎస్టీ యాక్ట్‌ అమల్లోకి వచ్చింది. పెట్రో ఉత్పత్తులైన పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌(ఏవీయేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్​), నేచురల్‌ గ్యాస్‌, క్రూడ్‌ ఆయిల్‌ జీఎస్టీ పరిధిలో లేవు. పెట్రో ఉత్పత్తులు జీఎస్టీలోకి తీసుకొస్తే ఆదాయం కోల్పోతామని అనేక రాష్ట్రాలు దీన్ని  వ్యతిరేకిస్తున్నాయి. జీఎస్టీ అమలైతే దేశమంతా ఒకే ట్యాక్స్‌ ఉండనుంది. ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.100 నుంచి రూ.110 వరకు, డీజిల్‌ రూ.90 నుంచి రూ.100 వరకు ఉంది. ఇది వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో గూడ్స్‌, నిత్యావసరాలు తదితర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.  
77శాతం జీఎస్టీలోకే మొగ్గు..
ఇటీవల జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులు చేర్చుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోకల్​ సర్కిల్స్‌ అనే సంస్థ ఆన్‌లైన్‌లో సర్వే చేసింది. 77శాతం మంది జనం పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని కోరారు. 11శాతం మంది మాత్రమే జీఎస్టీలో చేర్చవద్దని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 12శాతం మంది మాత్రం ఏం చెప్పలేమన్నారు. ఇక పెట్రో, డీజిల్‌ జీఎస్టీలోకి వస్తే వాటిపై 28శాతం జీఎస్టీ వేశారనుకున్నా లీటర్‌ పెట్రోల్‌ రూ. 75, డీజిల్‌ రూ.70కే లభించే ఛాన్స్‌ ఉంటుంది.   
51శాతం మంది ఖర్చులు తగ్గించుకుంటున్రు..
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ప్రజలు ఖర్చు తగ్గించుకుంటున్నారు. ‘‘పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు..’’ అని సర్వేలో మరో ప్రశ్న అడిగారు. ఇందులో 51శాతం మంది ఖర్చులు తగ్గించుకుంటున్నామని, 21శాతం మంది నిత్యావసరాలు తగ్గిస్తున్నామని, 14శాతం మంది పొదుపు చేస్తున్నామని చెప్పారు.