
ఇబ్రహీంపట్నం, వెలుగు: పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురాలేదని భార్యతో చనువుగా ఉన్నప్పటి ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడో భర్త. ఎస్సై రాజప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన నలిమెల సంతోశ్‌తో నాలుగేళ్ల క్రితం పెండ్లయ్యింది. మూడేండ్ల తర్వాత సంతోశ్ తోపాటు అతని కుటుంబ సభ్యులు లాస్యను పుట్టింటి నుంచి రూ.2లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం స్టార్ట్చేశారు. తట్టుకోలేకపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అడిగినంత డబ్బు తీసుకురాలేదనే కోపంతో భార్యతో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సంతోశ్ వాట్సాప్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ చేశాడు. అవి చూసిన లాస్య ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కంప్లైంట్ చేసింది. పోలీసులు గృహహింస, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. కాగా సంతోశ్ లాస్యకు విడాకులు ఇవ్వకుండానే నిజామాబాద్జిల్లా భీంగల్‌కు చెందిన మహిళను నెలరోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.