
- సుమోటో పిటిషన్‌పై స్పష్టతివ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలోని పోస్టులను భర్తీచేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పోలీసు పోస్టుల భర్తీ చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కె.అఖిల్ శ్రీ గురుతేజ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసు శాఖలోని పోస్టుల భర్తీలో ప్రభుత్వం రాజీ పడుతున్నదన్నారు. పోలీసు నియామకాలు చేపట్టకపోవడంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లడంతోపాటు దర్యాప్తులు ముందుకు సాగడంలేదని, ప్రజాభద్రతకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 7 నాటికి పోలీసు శాఖలో మంజూరైన 91,169 పోస్టుల్లో 14,935 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.