శాస్త్రీయ కృషి కొనసాగుతుంది..శాస్త్రవేత్తలకు అభినందనలు

 శాస్త్రీయ కృషి కొనసాగుతుంది..శాస్త్రవేత్తలకు అభినందనలు

సూర్యుడి రహస్యాలపై అధ్యయనం చేసేందుకు ఇస్రో  రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 రాకెట్ ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. మొదటి కీలకమైన నాలుగు దశలను ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతంగా దాటడంతో ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది.  పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతంగా వేరు చేయబడిందని ఇస్రో తెలిపింది. ఎల్ 1 పాయింట్ వద్దకు ఉపగ్రహం ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొంది. 

మోదీ అభినందనలు..

చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.  భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు.  సమస్త మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహన పెంపొందించేందుకు అవిశ్రాంతమైన శాస్త్రీయ కృషి కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

శాస్త్రవేత్తల సంబురాలు

ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.  ఈ సందర్భంగా  ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైందని  ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆదిత్య ఎల్1 కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు చెప్పారు. ఆదిత్య ఎల్ 1 దాదాపు 125 రోజులు ప్రయాణించి.. ఎల్ 1 పాయింట్‌ను చేరుకుంటుందని.. ఆదిత్య ఎల్‌1కు ఆల్ ది బెస్ట్ చెప్పాలని అన్నారు.  అటు ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సక్సెస్ కావడంపై   కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.