ప్రధాని మోడీ - ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భేటీ.. యుద్దం మొదలైన తర్వాత ఇదే తొలిసారి

ప్రధాని మోడీ - ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భేటీ.. యుద్దం మొదలైన తర్వాత ఇదే తొలిసారి

జీ7 సదస్సులో భాగంగా హిరోషిమాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత ఇరువురు నేతలు వ్యక్తిగతంగా కలవడం ఇదే తొలిసారి.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ జీ7 సమ్మిట్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో మే 20న హిరోషిమా చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ అంతకుమునుపే హిరోషిమాకు బయలుదేరి అక్కడ G7 లీడర్స్ తో సమావేశమవుతారు. దాంతో పాటు క్వాడ్ నాయకత్వ సదస్సులోనూ పాల్గొననున్నారు.

ఫిబ్రవరి 2022లో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రధాని మోడీని కలవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా న్యూఢిల్లీకి వెళ్లి ఉక్రెయిన్ 'శాంతి ప్రణాళిక'కు మద్దతు ఇవ్వాలని భారత్‌ను కోరారు.  తూర్పు ఐరోపా ప్రాంతంలో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించడం వంటి విషయాల్లో అనేక సందర్భాల్లో రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది.

ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోడీ ఒకసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. 2022 సెప్టెంబరులో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) పక్షాన జరిగిన వారి సమావేశంలో, మోడీ పుతిన్‌తో ఇది "యుద్ధ యుగం కాదు" అని చెప్పారు. దీనిపై అప్పట్లో ప్రపంచ నాయకులు సైతం స్పందించారు.

మే 19 నుంచి మే 21 వరకు జపాన్ లో జీ-7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఇప్పటికే వివిధ దేశాల అధ్యక్షులు జపాన్ చేరుకోగా.. ప్రధాని మోడీ మే 19న ఉదయం జపాన్ బయల్దేరి వెళ్లారు. మే 20, మే 21 తేదీలలో జరగనున్న రెండు అధికారిక సెషన్లలో మోడీ పాల్గొననున్నారు. మొదటి సెషన్ ఆహారం, అభివృద్ధి, ఆరోగ్యం, లింగ సమానత్వంపై ఉంటుంది. రెండవ సెషన్ వాతావరణం, శక్తి, పర్యావరణంపై అనే అంశాలపై ఉంటుంది. ఈ సెషన్‌లో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతతో పాటు ప్రపంచ సవాళ్లపై మోడీ ప్రసంగించనున్నారు.