కరోనా వ్యాప్తి నివారణలో మరింత సమర్థవంతంగా కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. వైరస్ మ్యూటేషన్ పై మరింత డైనమిక్ గా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో ఎక్కువ వైరస్ కేసులు నమోదు, మరణాలు సంభవిస్తోన్న పది రాష్ట్రాల సీఎంలు, జిల్లా అధికారులతో ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడిన మోడీ.. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర సహకారం, వైద్య పరికరాల అవసరం, కరోనా కట్టడిలో జిల్లా అధికారులు చేపడుతోన్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
వైరస్ మ్యుటేషన్ పై సైంటిస్టులు సమర్థవంతంగా పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు మోడీ. ముఖ్యంగా గ్రామాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. దేశ యువత, పిల్లల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ కంట్రోల్ తో పాటూ, పేద ప్రజల జీవన ప్రమాణాలపై దృష్టి పెట్టడం ఎంతో అవసరమన్నారు.గత అనుభవాలు, సాధించిన విజయాలతో మరింత వ్యూహాత్మకంగా వైరస్ ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్రాల సీఎంలను కోరారు.
తాను ఎన్నో స్థాయిలను చూసి ఇక్కడకు వచ్చాన్న ప్రధాని మోడీ.. భిన్న సంస్కృతులు, మతాలు దేశంలో ఉన్నాయన్నారు. పట్టణాలకంటే గ్రామాల్లో ప్రజలు మరింత ఐకమత్యంగా ఉంటారని తెలిపారు. అక్కడ అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి పని చేస్తే త్వరగా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు. దేశంలో కొద్ది కాలంగా యాక్టీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయని.. అయినా మనం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
వైరస్ మ్యుటేషన్‌లో, ఫార్మాట్‌ను మార్చడంలో వేగంగా కదులుతోందన్న ప్రధాని మోడీ.. మన పద్ధతులు, వ్యూహాలు కూడా డైనమిక్‌గా ఉండాలని ఆయా రాష్ట్రాల సీఎంలను, అధికారులను కోరారు. టీకా వ్యర్థాలను సాధ్యమైనంత తగ్గించాలన్నారు. ప్రాణాలను రక్షించడంతో పాటు, వారి జీవితాన్ని సులభంగా ఉంచడమూ మన ప్రాధాన్యతేనని అన్నారు. పేదలకు ఉచిత రేషన్ కోసం సౌకర్యాలు అందించడం, బ్లాక్ మార్కెటింగ్‌పై నిషేధం పై ఫోకస్ ఉంచాలన్నారు. కరోనాపై పోరాటంలో విజయం సాధించడానికి ఇవన్నీ ఎంతో అవసరమన్నారు ప్రధాని మోడీ.
