రాజగోపాల్ నిరసనలో జర్నలిస్టును నెట్టేసిన పోలీసులు

రాజగోపాల్ నిరసనలో జర్నలిస్టును నెట్టేసిన పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా: బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన కార్యక్రమంలో ఓ వీడియో జర్నలిస్టును పోలీసులు నెట్టేసి కింద పడేశారు. గొల్ల కురుమల కోసం పోరుబాట పట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేసిందంటూ బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకురుమల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన డబ్బులను వెనక్కి తీసుకుందని ఆరోపిస్తూ చేపట్టిన ఈ నిరసనకు జనం భారీగా తరలివచ్చారు.

రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ వీడియో జర్నలిస్టు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నెట్టేయడంతో ఆ జర్నలిస్టు కిందపడిపోయినా పట్టించుకోలేదు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న తీరును కొందరు వీడియో తీస్తుండగా..  వీడియో జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించి నెట్టేసిన ఘటన రికార్డయింది.