
- అభ్యర్థుల వేటలో పార్టీలు
- ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తి
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
పోలింగ్ అధికారులకు శిక్షణ..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే ప్రకటించారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లను సైతం అధికారులు సమకూర్చారు. ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.
అభ్యర్థుల వేటలో పార్టీలు..
జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ ఖరారు కావడంతో అందుకు అనుగుణంగా అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఆయా చోట్ల ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో రిజర్వేషన్ కు అనుగుణంగా సమర్థులు ఎవరనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల వివరాలు...
జిల్లాలు జడ్పీటీలు ఎంపీటీసీలు సర్పంచ్‌లు వార్డులు ఓటర్లు
మెదక్ 21 190 492 4,220 5,23,327
సంగారెడ్డి 25 261 613 5,370 7,44,157
సిద్దిపేట 26 230 580 4,508 6,55,958