
- మొత్తం ఓటర్లలో 30 శాతం యూత్
- గెలుపోటముల్లో వారి ఓట్లే కీలకం
- ఆకట్టుకునే ప్రయత్నాల్లో లీడర్లు
హైదరాబాద్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వారి ఓట్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండటంతో తమవైపు తిప్పుకునేందుకు లీడర్లు వ్యూహాలు పన్నుతున్నారు. ఈసారి నియోజకవర్గాల వారీగా గతంలో కంటే ఎక్కువగా యువ ఓటర్లు నమోదు కావడం, వారు ఏ పార్టీకి మద్దతిస్తారనేది అంతుపట్టకుండా ఉంది. ప్రధాన పార్టీల నాయకులకు యువ ఓటరు నాడి దొరకడం లేదు.
ఇటీవల ఈసీ ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటర్ల లెక్కల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,06,42,333 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్సు వారే 7 లక్షల మంది దాకా ఉన్నారు. 19 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు వాళ్లు 75 లక్షల మంది దాకా ఉన్నారు. ఫైనల్ ఓటర్ల జాబితాలో ఈ యువ ఓటర్ల సంఖ్య ఇంకింత పెరిగే చాన్స్ ఉన్నది. దీంతో మొత్తం ఓటర్లలో 30 శాతంపైనే యూత్ ఉండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. యువతను ఎలా ఆకట్టుకోవాలనే దానిపైనే ప్లాన్లు చేస్తున్నాయి.
పేపర్ల లీకేజీలు బీఆర్ఎస్కు మైనస్
యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. జాబ్ నోటిఫికేషన్లను బీఆర్ఎస్ లీడర్లు వీలుదొరికినప్పుడల్లా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ఆ పార్టీకి మైనస్‌గా మారింది. అదేవిధంగా, గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో ఇటీవల ‘సీఎం కప్’ పేరుతో యువతను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. గ్రామాల్లోని అన్ని క్రీడా ప్రాంగణాల్లో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసేందుకు గులాబీ లీడర్లు ఏర్పాటు చేస్తున్నారు.
జాబ్స్, డిక్లరేషన్‌తో కాంగ్రెస్ముందుకు
తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. ఇప్పటికే యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. యువతను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసిందని ప్రజలకు వివరించే పనిలో కాంగ్రెస్ లీడర్లు నిమగ్నమయ్యారు. పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని కూడా జనంలోకి తీసుకెళ్తున్నారు. నిరుద్యోగ భృతి ఏమైందంటూ యువతతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
పోరాటాలతో బీజేపీ మద్దతు
రాష్ట్రంలో ఎక్కువ శాతం యూత్ తమవైపే ఉన్నారని బీజేపీ భావిస్తున్నది. నిరుద్యోగులకు మద్దతుగా వారితో కలిసి ఆందోళనలు కొనసాగిస్తున్నది. గ్రామాల్లో యువ మోర్చాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సరిగ్గా కాపాడగలరనే విశ్వాసాన్ని యూత్‌లో నింపేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నది.