ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షించడానికి వ్యాక్సిన్లు తయారుచేస్తున్నారు. రోగం రాకముందే చనిపోయిన లేదా నిర్వీర్యం చేసిన బ్యాక్టీరియా లేదా వైరస్‌లను టీకాల ద్వారా ప్రవేశపెట్టి, శారీరక రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తున్నారు. ఇది హానికరమైన వ్యాధి కారకాలను గుర్తించి పోరాడటానికి ఉపయోగపడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి ఇదే సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం అని ఆధునిక వైద్యులు నమ్ముతున్నారు. అయితే, అంతిమంగా రోగాలను నిరోధించేది శరీరంలో ఉండే సహజరోగ నిరోధక వ్యవస్థేకాని టీకాలు కాదు. బ్యాక్టీరియాను లేదా వైరస్‌ను నిర్జీవంగా శరీరంలో ప్రవేశపెట్టి రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి వాటి ద్వారా ప్రాణమున్న బ్యాక్టీరియాను ఎదుర్కోవడం టీకాల పని. ఆ లెక్కన అన్ని టీకాలు ఔషధాలు కావు.
ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఇతర ఆరోగ్య సంస్థలు వ్యాక్సిన్‌లను ఒక రకమైన మందుగా, ప్రత్యేకంగా నివారణ మందుగా నిర్వచిస్తాయి. ఒకసారి అనారోగ్యం ప్రారంభమైన తర్వాత టీకాలు తీసుకుంటే సాధారణంగా అవి సహాయపడవు. ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థ రక్షణను పెంపొందించుకోవడానికి సమయం కొన్ని రోజుల నుంచి వారాల వరకు పడుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ ప్రారంభమైన తర్వాత వ్యాక్సిన్‌లు చికిత్సగా ప్రభావవంతంగా పనిచేయవు. వ్యాధి వ్యాప్తిని ఆపడానికి అవి తగినంత వేగంగా పనిచేయవు. అవి నివారణ సాధనాలుగానే ఉంటాయి. అయితే, వ్యాధి నెమ్మదిగా అభివృద్ధి చెందే ప్రత్యేక సందర్భాలలో, కొన్ని వ్యాక్సిన్‌లను వ్యాధి సోకిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు. కానీ, నయం చేయడానికి కాదు. వ్యాధి తీవ్రతరం కాకుండా నిరోధించడానికి. అయితే, టీకా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. కానీ, ఇప్పటికే సోకిన వ్యాధికి చికిత్స చేయదు. ప్రపంచవ్యాప్తంగా రేబీస్ ఒక ప్రముఖ ఉదాహరణ. సాధారణ వైద్య వినియోగంలో కేవలం 6–7 ప్రధాన పీఈపీలు ఉన్నాయి (రేబీస్, టెటానస్, హెపటైటిస్ బి, హెచ్‌ఐవి, వేరిసెల్లా, మీజిల్స్, హెపటైటిస్ ఎ). వీటితో పాటు కొవిడ్-19 వంటి ప్రయోగాత్మకమైనవి కూడా ఉన్నాయి.
30కి పైగా వ్యాక్సిన్‌లకు డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా వ్యాక్సిన్‌లను సిఫార్సు చేస్తోంది. ఇవి తట్టు, పోలియో, హెపటైటిస్, ఇన్‌ఫ్లుయెంజా, హెచ్ఐవీ, కొవిడ్-19 వంటి ప్రధాన అంటువ్యాధులను కవర్ చేస్తాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా విభిన్న వ్యాక్సిన్‌లు వాడుకలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లలకు సుమారు 12–14 కీలక టీకాలను సిఫార్సు చేస్తుంది. ఇవి క్షయ, పోలియో, డిఫ్తీరియా, టెటానస్, పెర్టూసిస్, తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా, హెపటైటిస్ బి, హిబ్, రోటావైరస్, న్యుమోకాకల్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులను కవర్ చేస్తాయి. భారతదేశంలో జాతీయ రోగనిరోధకత షెడ్యూల్ కూడా ఇలాంటి టీకాలనే సిఫారసు చేస్తున్నది.
డోసులు తగ్గించిన అమెరికా
1980లో అమెరికన్ పిల్లలకు ఏడు వేర్వేరు వ్యాధుల కోసం 7 ఇంజెక్షన్లలో 23 వ్యాక్సిన్ డోస్‌లను, అదనంగా 4 ఓపీవీ చుక్కలను ఇవ్వాలని, అమెరికా వైద్య నియంత్రణ సంస్థ (సీడీసీ) ఇచ్చిన రోగనిరోధక టీకాల షెడ్యూల్ ప్రకటించింది. 44 ఏండ్ల తరువాత 2024నాటికి సిఫార్సు చేసిన సాధారణ టీకాల సంఖ్య 17 వ్యాధుల కోసం 57 ఇంజెక్షన్లలో కనీసం 84 వ్యాక్సిన్ డోస్‌లకు పెరిగింది. దీనికి అదనంగా మొత్తం 18 వ్యాధుల కోసం, ఆర్ఎస్వీ మోనోక్లోనల్ యాంటీబాడీ రోగనిరోధక టీకా కూడా ఉంది. ఈ మధ్యనే అమెరికాలో పిల్లలకు విధిగా ఇవ్వాల్సిన 80కు పైగా టీకాలను 11కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు సాధారణంగా రాలేదు. అనేక సంవత్సరాలు అక్కడి తల్లిదండ్రులు, వైద్యులు, ఇంకా ఇతరులు పోరాటం చేస్తే ఈ మాత్రం తగ్గింపు వచ్చింది. టీకా పరిశ్రమ లాబీ చాలా బలంగా ఉన్నందున ఈ మార్పు కూడా ఎన్ని రోజులవరకు నిలకడగా ఉంటుంది అనేది అనుమానమే. అధ్యక్షుడు ట్రంప్ కోరిన తరువాత ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లను సమీక్షించి, వారి ఉత్తమ పద్ధతులను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం వెలువడింది. జపాన్, డెన్మార్క్, జర్మనీ ఆరోగ్యమంత్రిత్వ శాఖలతో సంభాషణలు జరిపారు. అమెరికాలోని ఇతర వైద్య సంబంధిత శాస్త్రవేత్తలు కూడా ఇతర దేశాల శాస్త్రీయ పరిశోధనలు, వివిధ ఆధారాల మధ్య అంతరాలు, యాదృచ్ఛిక పరీక్షల గురించి చర్చించిన పిదప 84 టీకాలను 11కు తగ్గించారు.
మన పాలకులు సమీక్షకు సిద్ధంగా లేరు
భారతదేశంలో జాతీయ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ (ఎన్ఐఎస్) ప్రకారం పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలకు 27–30 టీకా మోతాదులను సిఫార్సు చేస్తుంది. ఈ మోతాదులు క్షయ, పోలియో, డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బి, హిబ్, మీజిల్స్-రుబెల్లా, రోటవైరస్, న్యుమోకాకల్ ఇన్ఫెక్షన్లు, జపనీస్ ఎన్సెఫాలిటిస్ (స్థానిక జిల్లాల్లో) వంటి కీలక వ్యాధులను కవర్ చేస్తాయి. మన దేశంలో ప్రభుత్వాధినేతలు టీకాల సంఖ్య, డోసులు పెరగడానికి దోహదపడుతున్న కారణాలను సమీక్ష చేయడానికి సిద్ధంగా లేరు. ఆస్ట్రేలియా (13 టీకాలు), ఫ్రాన్స్ (11 టీకాలు), ఇటలీ (10 టీకాలు), అమెరికాలో నిర్బంధ కార్యక్రమాలు ఉన్నాయి. అయితే, అనేక వర్ధమాన దేశాలు, అమెరికా సహా వీటిని స్వచ్ఛందంగా కాకుండా నిర్బంధంగా అమలు చేస్తున్నాయి.
టీకాలలో ఏముంటాయి?
వ్యాక్సిన్లలో యాంటిజెన్‌లు (రోగనిరోధక వ్యవస్థకు మీద పని చేసేవి), స్టెబిలైజర్లు, ప్రిజర్వేటివ్‌లు, సహాయకాలు, తయారీ ప్రక్రియ నుంచి అవశేషాలు ఉంటాయి. వ్యాక్సిన్‌లలో ఉండే పదార్థాలలో ప్రతిదానికీ ఒక నిర్దిష్ట పాత్ర ఉంటుంది. అవి యాదృచ్ఛికంగా అక్కడ ఉండవు. ఉదాహరణకు అల్యూమినియం లవణాలు, థైమెరోసల్ (పాదరసం ఆధారిత సమ్మేళనం), చక్కెరలు (లాక్టోస్, సుక్రోజ్), జిలాటిన్ లేదా ప్రోటీన్లు. వీటివలన ఏ హామీ ఉండదు అని మొదట్లో భావించేవారు. వేడి, కాంతి లేదా తేమకు గురైనప్పుడు టీకాలు క్షీణిస్తాయి. నిల్వ చేసేటప్పుడు, రవాణాలో వ్యాక్సిన్‌ను క్షీణించకుండా, చక్కెరలు (సుక్రోజ్, లాక్టోస్), జెలటిన్ లేదా ప్రోటీన్లు కలుపుతారు. ఒకే సీసాలో ఎక్కువ మందికి ఇచ్చే మోతాదు ఉన్నపుడు వ్యాక్సిన్ కలుషితం కాకుండా నిరోధించటానికి థైమెరోసల్ (నేడు అరుదుగా), ఫినాల్ లేదా 2- ఫినాక్సీథనాల్. చాలా దేశాలలో ఒక వయల్‌ను ఎక్కువ మంది పిల్లలకు ఉపయోగిస్తారు. సంరక్షణ లేకుంటే లోపల బ్యాక్టీరియా పెరుగుతుంది. వ్యాక్సిన్లలో ఉపయోగించే పదార్థాలలో కొన్నింటి వల్ల దుష్పరిణామాలు ఉన్నాయని అభివృద్ధి చెందిన దేశాలలో వాటిని దశలవారీగా తొలగించారు, పరిమితం చేశారు లేదా నిషేధించారు.
టీకాలపై అవగాహన కల్పించాలి
టీకాలకు భారీగా సబ్సిడీ ఇస్తున్నందున ప్రభుత్వం ఖర్చు తగ్గింపుకు ప్రాధాన్యతనిస్తున్నది. అయితే, థైమెరోసల్తో కూడిన టీకాల వలన ఏర్పడే ప్రమాదాన్ని విస్మరిస్తున్నది. చిన్నారుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నది. కొందరికే ప్రమాదం అని చెబుతున్నా దానిని బలపరిచే సరి అయిన లెక్కలు లేవు. టీకాల వలన ఏర్పడుతున్న దుష్ప్రభావాల మీద కనీస సమాచార సేకరణ లేదు. టీకా తీసుకున్న తరువాత దుష్ప్రభావం ఏర్పడితే ఎవరికి చెప్పుకోవాలో కూడా పేషెంట్లకు తెలియదు. ఏ స్థాయిలో ప్రమాదం ఆమోదయోగ్యమైనదో ఎవరు నిర్ణయించాలి.. - నిపుణులు, ప్రభుత్వాలు లేదా కుటుంబాలు? అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు టీకాలు వేయడం సమష్టి బాధ్యతగా, వ్యక్తులు, కుటుంబాలు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చూడడం వ్యాక్సిన్ పరిశ్రమకు కలిసివచ్చింది. దుష్ప్రభావాల వల్ల జీవితకాల భారం వారిమీద ఉంటుంది. కాబట్టి టీకాల గురించిన అవగాహన తల్లిదండ్రులకు కలిగించాల్సిన అవసరం ఉన్నది. తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత వైద్యుల మీద, ప్రభుత్వం మీద ఉన్నది. దుష్ప్రభావాలు ఏర్పడితే దానికి వ్యాక్సిన్ తయారీదారులు బాధ్యత తీసుకోవాలి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
