
మహారాష్ట్రలోని థానే నగరంలో పెద్ద ఎత్తున కడుతున్న ఒక బిల్డింగ్లో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే 39 ఏళ్ల కార్మికుడు దాదాపు 15 గంటల పాటు క్రెడిల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. చివరికి బుధవారం ఉదయం అతన్ని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు చెప్పారు.
వివరాలు చూస్తే కోల్‌కతాకు చెందిన అల్లో హుస్సేన్ అనే కార్మికుడు మజివాడ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో 21వ అంతస్తులో పెయింటింగ్ పని చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కరెంట్ పోవడంతో లిఫ్ట్ అక్కడే ఆగిపోయింది. దింతో అల్లో హుస్సేన్ అక్కడే లిఫ్ట్‌లోనే చిక్కుకున్నాడు.
ఈ బిల్డింగ్ ఒక పెట్రోల్ పంప్ ఎదురుగా ఉంది. దీనికి బేస్‌మెంట్‌లో నాలుగు అంతస్తుల పార్కింగ్, పైన 35 అంతస్తులు ఉన్నాయి. థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ హెడ్ యాసిన్ తడ్వి చెప్పిన వివరాల ప్రకారం, హుస్సేన్ రాత్రంతా క్రెడిల్ లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. తరువాత రోజు ఉదయం సహాయం అందే వరకు అతను అక్కడే ఉండాల్సి వచ్చింది అని అన్నారు.
అల్లో హుస్సేన్ కిందకు రాలేకపోవడంతో అతన్ని కాపాడటానికి అతని సహచరులు పై అంతస్తు నుండి నీళ్ళు ఇచ్చి సాయం చేశారు. జూలై 9 తెల్లవారుజామున బాల్కం ఫైర్ స్టేషన్‌కు ఈ విషయం తెలిసి వెంటనే సహాయక బృందం చేరుకున్నాయి.
ALSO READ : అనిల్ అంబానీకి దిల్లీ హైకోర్టు ఉపశమనం.. పెరిగిన స్టాక్ ఇదే..
కరెంట్ పోవడం వల్ల లిఫ్ట్ పనిచేయలేదు. పైగా కరెంట్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో సహాయం ఆలస్యం అయ్యింది. దింతో యాసిన్ తడ్వి మహారాష్ట్రలోని ఒక సీనియర్ కరెంట్ ఆఫిసరుకు ఫోన్ చేయగా, ఆయన వెంటనే ఇద్దరు సిబ్బందిని పంపించారు. తరువాత ఒక జనరేటర్ కూడా అక్కడికి వచ్చింది. విపత్తు నిర్వహణ అధికారులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), పోలీసులు, అగ్నిమాపక దళం, కరెంట్ సిబ్బంది, జనరేటర్ బృందం అందరూ కలిసి ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇరుక్కున్న ఆ కార్మికుడిని సురక్షితంగా కిందకు తీసుకురాగలిగారు అని ఆయన వివరించారు.