ప్రిన్సిపల్ సెక్రటరీతో పని చేయలేకపోతున్నం.. మంత్రి దయాకర్ రావుకు పీఆర్ ఆఫీసర్ల ఫిర్యాదు

ప్రిన్సిపల్ సెక్రటరీతో పని చేయలేకపోతున్నం..  మంత్రి దయాకర్ రావుకు పీఆర్  ఆఫీసర్ల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు : పంచాయతీ రాజ్  ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్  కుమార్  సుల్తానియాపై ఆ శాఖ అధికారులు  తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయలేకపోతున్నామని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సీఈవో, డిప్యూటీ సీఈవోల వెల్ఫేర్ అసోసియేషన్  ప్రెసిడెంట్  రాఘవేందర్ రావు, జనరల్  సెక్రటరీ శ్రీనివాస్  లేఖ రాశారు. డిపార్ట్ మెంట్ లో సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి పంచాయతీ సెక్రటరీ వరకు ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని లేఖలో  వారు పేర్కొన్నారు. 

చిన్నచిన్న కారణాలతో సిబ్బందిని సస్పెండ్  చేయడం, సరెండర్  చేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. మూడేండ్లుగా పనిచేస్తున్న ప్రిన్సిపల్  సెక్రటరీని బదిలీ చేయాల్సిందే అని లేఖలో వారు డిమాండ్  చేశారు. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించినపుడు వాడకూడని భాషలో తిడుతున్నారని, అధికారులు తమ బాధను చెప్పుకునేందుకు సైతం అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా పరిషత్  సీఈవో నుంచి సెక్రటరీల వరకు సుమారు 200 మంది అధికారులు, ఉద్యోగులు సమావేశమై ప్రిన్సిపల్  సెక్రటరీ తీరుపై చర్చించామని వెల్లడించారు. 

ఆయన తీరుతో లాంగ్ లీవ్ లో వెళ్లేందుకు రెడీ అవుతున్నామని కొంత మంది అధికారులు మీటింగ్ లో పేర్కొన్నారని తెలిపారు. కాగా, కొంత కాలం క్రితం తన కుమారుడి పెళ్లికి పీఆర్ డిపార్ట్ మెంట్ లోని అన్ని జిల్లాల ఆఫీసర్లకు ప్రిన్సిపల్  సెక్రటరీ డ్యూటీలు వేయటం రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లా అధికారులంతా హైదరాబాద్ కు వచ్చి పెండ్లి డ్యూటీ చేయడం వివాదాస్పదంగా మారింది.a