
కమెడియన్ ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ సాయం చేసాడని వార్తలొస్తున్నాయి. ప్రభాస్ రూ.50 లక్షలు సాయం ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయంపై ఫిష్ వెంకట్ భార్య క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ స్పందించి రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన భార్య వివరించారు. బహుశా మా కష్టం గురించి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. తెలిస్తే మాత్రం తప్పకుండా సాయం చేయడానికి ప్రభాస్ ముందుకొస్తారని ఫిష్ వెంకట్ భార్య అన్నారు.
అసలేమైందంటే:
ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి ప్రముఖ మీడియాతో మాట్లాడి వివరాలు పంచుకుంది. హీరో ప్రభాస్ బృందం తనకు ఆర్థిక సహాయం చేస్తున్నారంటూ చెప్పింది. ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి 'కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం' అని హామీ ఇచ్చారని మీడియాతో తెలిపింది.
ఈ క్రమంలోనే ప్రభాస్ రూ.50 లక్షలు సాయం చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని ఫిష్ వెంకట్ భార్య, ఆయన కూతురు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. సాయం చేస్తామని చెప్పిన నెంబర్ కు కాల్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పారు. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి ఎలాంటి సాయం అందలేదని వారు క్లారిటీ ఇచ్చారు.
ఫిష్ వెంకట్ హెల్త్ కండీషన్:
ఫిష్ వెంకట్ కిడ్నీఫెయిల్యూర్ తో అతని ఆరోగ్యంగా విషమంగా ఉంది. ప్రస్తుతం బోడుప్పల్ లోని ఆర్బీఎం ఆసుపత్రిలో ఐసియులో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ కు సాయం చేయాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించి సాయం చేయాలనీ, దాతను కనుగొనడంలో వారు మాకు సహాయం చేస్తారని అభ్యర్థిస్తున్నారు.