
ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నేడు (జూన్ 16న) రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో గ్రాండ్ ఈవెంట్‌లో టీజర్ లాంచ్ అయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో టీజర్ రిలీజ్ చేశారు. హారర్, కామెడీ, రొమాన్స్తో టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభాస్ డీసెంట్ లుక్స్, స్వీట్ డైలాగ్స్, హారర్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. హారర్ ఎలిమెంట్స్తో భయపెట్టడమే కాకుండా.. ఆసక్తిని రేపే కామెడీతో కలర్ ఫుల్గా టీజర్ సాగింది.
దట్టమైన అడవి, చీకటి భవనంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. 'ఈ ఇల్లు నా దేహం.. ఈ సంపద నా ప్రాణం.. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను' అని సంజయ్ దత్ టీజర్ స్టార్టింగ్ లోనే చెప్పిన డైలాగ్ సినిమా మెయిన్ స్టోరీని చెబుతుంది. ఆ తర్వాత భయపెట్టే విజువల్స్, సడెన్ గా వచ్చి వెళ్లే వింత ఆకారాలు ఆసక్తిని పెంచాయి.
ఇక స్లో మోషన్ లో ప్రభాస్ ఎంట్రీ.. హలో..హలో.. బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంత అంతా మాత్రం, నేరాలు పాపాలు ఏంటండీ? డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తే' అని ప్రభాస్ చెప్పే క్యూట్ డైలాగ్స్ భలే అనిపిస్తున్నాయి. హే జగన్నాథ ప్రభూ క్యా హువారే అనే మీమ్ డైలాగ్ సైతం భలే ఉంది. చివర్లో హార్రర్ ఇన్సిడెంట్ తో ప్రభాస్ భయపడే విధానం క్యూరియాసిటీ పెంచేలా చేస్తోంది. టీజర్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియా మొత్తం షేక్ అయ్యేలా రాజాసాబ్ జోరు చూపించేలా ఉన్నాడు.
‘ఇప్పటి వరకు ఒక లెక్క...రేపటి నుండి ఒక లెక్క.. రాజా సాబ్ ఒక అభిమానుల వేడుక..ప్రేక్షకులకు నిజమైన దృశ్య విందు.. ఇన్నేళ్లూ, ఇది మీ ప్రేమ.. ఇప్పుడు మా ప్రేమను ఇకపై చూస్తారు.. మిమ్మల్ని గర్వపడేలా చేయడానికి మేమంతా రెడీ ఉన్నాం’ అని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రభాస్ కెరీర్‌లో.. ఫస్ట్ టైమ్ హారర్ జానర్‌లో నటిస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ప్రభాస్ కామెడీ రోల్ను చూడటానికి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ మరియు యోగి బాబు ప్రముఖ పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించింది.