కేంద్రంలో మళ్లీ బీజేపీనే..300కుపైగా సీట్లు గెలుస్తుంది: ప్రశాంత్​ కిశోర్

కేంద్రంలో మళ్లీ బీజేపీనే..300కుపైగా సీట్లు గెలుస్తుంది: ప్రశాంత్​ కిశోర్
  • తెలంగాణలో మొదటి లేదా రెండోస్థానంలో బీజేపీ
  •     ఒడిశా, బెంగాల్​లో బీజేపీ హవా
  •     370కు పైగా సీట్లు మాత్రం గెలిచే అవకాశం లేదన్న స్ట్రాటజిస్ట్​

న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారే వస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ తెలిపారు. ఆ పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. తూర్పు, దక్షిణ భారతదేశంలో కాషాయ పార్టీ సీట్లు, ఓట్ల శాతంలో గణనీయమైన పురోగతి సాధిస్తుందని వివరించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ తిరుగులేని ఆధిపత్యంలో ఉందన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ ప్రధానమంత్రి మోదీని అధిగమించడం అసాధ్యమేమీ కాదని చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలుండేవని, కానీ బద్ధకం, తప్పుడు వ్యూహాలతో  కాలదన్నుకున్నయని విశ్లేషించారు. 

తెలంగాణలో ఫస్ట్​ లేదా సెకండ్​ స్థానంలో బీజేపీ..

తెలంగాణలో బీజేపీ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని, ఇది వారికి చాలా పెద్ద విషయమని ప్రశాంత్​కిశోర్​ పేర్కొన్నారు. ఒడిశా, బెంగాల్​లలో బీజేపీ నంబర్ వన్ స్థానంలో ఉండటం ఖాయమని చెప్పారు. తమిళనాడులో డబుల్​ డిజిట్​ ఓట్ల శాతం సాధిస్తుందని చెప్పారు. అయితే, బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఈసారి 370కుపైగా సీట్లు వచ్చే అవకాశం మాత్రంలేదని ప్రశాంత్​ కిశోర్​ వెల్లడించారు. 

ఉత్తర, పశ్చిమ భారత్​లో బీజేపీకే పట్టు

ఉత్తర, పశ్చిమ భారతదేశంలో బీజేపీ పట్టు నిలుపుకుంటుందని ప్రశాంత్​ కిశోర్​ తెలిపారు.  ఇక్కడ కాంగ్రెస్​ సహా ప్రతిపక్షాలు బీజేపీ 100 సీట్లు గెలవకుండా అడ్డుకోగలిగితేనే  బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని, కానీ ఆ అవకాశం లేదని చెప్పారు. ఈ సారి తూర్పు, దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఇక్కడ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని అన్నారు. యూపీ, బిహార్​, మధ్యప్రదేశ్, మణిపూర్​, మేఘాలయాలో మాత్రమే పర్యటిస్తే తమిళనాడులో ఎలా గెలుస్తారు? అని కాంగ్రెస్​ను ఆయన ప్రశ్నించారు. 

జగన్​ గెలుపు చాలా కష్టం

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్​లో సీఎం జగన్​ సర్కారు మళ్లీ రావడం చాలాకష్టమని ప్రశాంత్​కిశోర్​ అభిప్రాయపడ్డారు. ‘చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్​లాగా జగన్​కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులుగా నియోజకవర్గాలకు ప్రొవైడర్​ మోడ్​లాగే ఉండిపోయారు. చక్రవర్తిలాగా ప్రజలకు తాయిలాలు ఇస్తూ.. ఉద్యోగాలు ఇవ్వడం మరిచారు. రాష్ట్ర​అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు’ అని వ్యాఖ్యానించారు.