- నీటిలో డేంజర్ లెవెల్లో నైట్రేట్, ఫ్లోరైడ్, ఆర్సెనిక్
- సీసం, కాడ్మియంలాంటి భార లోహాలతో క్యాన్సర్ ముప్పు
- పైపులైన్ల లీకేజీతో తాగునీటిలోకి చేరుతున్న మురుగునీరు
- నీటి కాలుష్యాన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా చూడాలని సూచన
హైదరాబాద్, వెలుగు: దేశంలోని మెట్రో సిటీలు, పట్టణాల్లో తాగునీటిలో యాంటీబయోటిక్స్ లాంటి శక్తివంతమైన మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా(సూపర్ బగ్స్) వ్యాప్తి పెరుగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. సిటీల్లో వేగంగా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలికవసతులు లేకపోవడం, మురుగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయి. దీంతో తాగునీటిలో సూపర్ బగ్స్ తోపాటు ప్రాణాంతక కెమికల్స్ కూడా కలుస్తున్నాయని తేలింది.
దేశంలోని మెట్రో సిటీల్లో 72% మురుగునీరు శుద్ధి కాకుండానే నదులు, భూగర్భంలోకి చేరుతుండటం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణమని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’లో ఇటీవల పబ్లిష్ అయిన ఈ స్టడీ రిపోర్ట్ తేల్చిచెప్పింది. స్టడీలో భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో సిటీలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని మురికివాడల్లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, ప్రజారోగ్య వ్యవస్థల డేటాను విశ్లేషించారు. గంగా నది పరివాహక ప్రాంతాలు, హర్యానాలాంటి పారిశ్రామిక ప్రాంతాలు, ఒడిశాలోని రూర్కెలాలాంటి నగరాల్లో గతంలో జరిగిన కాలుష్య ఉదంతాలను, తాజా నీటి నమూనాలను కలిపి ఈ పర్స్పెక్టివ్ రిపోర్టును రూపొందించారు.
దేశంలోని నగరాల్లో ఉత్పన్నమవుతున్న మురుగునీటిలో కేవలం 28 శాతం మాత్రమే శుద్ధి(ట్రీట్మెంట్) అవుతోంది. మిగిలిన 72 శాతం మురుగునీరు ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా భూగర్భంలోకి లేదా నీటి వనరుల్లోకి వెళ్తోంది. దీనికి తోడు పట్టణాల్లో పాతబడిన పైపులైన్లు లీక్ అవుతూ డ్రైనేజీ నీరు, తాగునీరు కలిసిపోతున్నాయి. ఫలితంగా టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ వంటివ్యాధులు వ్యాపిస్తున్నాయి. 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం నగరాల్లోనే ఉంటారని.. అందుకే ఇప్పుడే మేల్కోకపోతే గనక పరిస్థితి భయంకరంగా మారుతుందని స్టడీ హెచ్చరించింది. సూపర్ బగ్స్ తో పాటు నీటిలో ప్రమాదకర కెమికల్స్ కూడా మోతాదుకు మించి ఉన్నట్లు ఈ స్టడీ గుర్తించింది. నైట్రేట్, ఫ్లోరైడ్ వంటివి పిల్లల్లో ఎదుగుదల లోపాలు, ఎముకల బలహీనత (ఫ్లోరోసిస్)కు కారణమవుతున్నాయి. నీటిలో సీసం, క్రోమియం వంటి భార లోహాలు చేరడం వల్ల కేన్సర్, గుండె జబ్బులు వస్తున్నాయని రీసెర్చ్ లో తేలింది.
వంద శాతం ట్రీట్మెంట్ తప్పనిసరి..
నీటి నాణ్యతను కేవలం మున్సిపల్ ఇంజనీరింగ్ కోణంలో చూడటం మానుకోవాలని ఈ స్టడీ సూచించింది. నీటి కాలుష్యాన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని తెలిపింది. ‘‘పైపులైన్లలో 24 గంటల పాటు నిరంతర ప్రెజర్ ఉండేలా చూడాలి. తద్వారా బయటి కలుషితాలు లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు. మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసిన తర్వాతే పర్యావరణంలోకి వదలాలి. నీటి నాణ్యత డేటాను, వ్యాధుల డేటాను అనుసంధానించి రియల్ టైమ్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి” అని స్టడీ పేర్కొంది.

