టెస్టులు చేయక వ్యాక్సిన్​ అందక గోస

టెస్టులు చేయక వ్యాక్సిన్​ అందక గోస

సెంటర్ల దగ్గర వందల మంది క్యూ
వాపస్‌‌‌‌‌‌‌‌ పోతున్న సగం మంది
టెస్టులు, వ్యాక్సిన్ల కోసం ఆందోళన

హైదరాబాద్ / మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టులు, వ్యాక్సిన్ల కోసం జనం గోస వడ్తున్నరు. టెస్టు సెంటర్ల దగ్గర, వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నరు. ఎండలో గంటలు గంటలు నిలబడి అవస్థ పడుతున్నరు. టెస్టు సెంటర్ల దగ్గర రోజూ పెద్ద పెద్ద క్యూల్లో నిలవడి సతమతమైతున్నరు. అంత కష్టపడి నిలబడ్డోళ్లలో రోజూ సగం మంది వాపస్‌‌‌‌‌‌‌‌ పోతున్నరు. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌కైతే స్లాటే దొరకట్లేదు. దొరికినా క్యాన్సిలై ఇబ్బంది పడుతున్నోళ్లు కూడా ఉన్నరు. శుక్రవారం జిల్లాల్లో, సిటీలో 40 వ్యాక్సిన్, టెస్టింగ్ సెంటర్లలో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో విజిట్ చేసిన ‘వెలుగు’.. జనాలను ప్రశ్నించగా ఇదేం పరిస్థితంటూ గోడు వెళ్లబోసుకున్నరు. ఇట్లైతే సస్తమని అంటున్నరు. ఈ దుస్థితికి కారణమెవరని ప్రశ్నిస్తున్నరు.   
కేసులు పెరగడంతో టెస్టులు తగ్గించి..
రాష్ర్టంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం టెస్టులు తగ్గించింది. సింప్టమ్స్ ఉన్నవాళ్లకే టెస్టులు చేయాలంది. హాస్పిటళ్లకు యాంటీజెన్ కిట్ల సప్లైలో కోతపెట్టింది. నెలకిందట ఒక్కో జిల్లాలో 2 వేల నుంచి 3 వేల టెస్టులు చేయగా కొద్దిరోజులుగా వెయ్యికి అటూ ఇటుగా చేస్తున్నారు. డిస్ర్టిక్ట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు 100, సీహెచ్‌‌‌‌‌‌‌‌సీలకు 50 లోపు, పీహెచ్​సీకి 20  నుంచి 30 కిట్లే ఇస్తున్నారు. టెస్టుల కోసం కరోనా బాధితులు బారులు తీరి కనిపిస్తుంటే వైద్య సిబ్బందేమో టార్గెట్ మేరకు టెస్టులు చేసి చేతులెత్తేస్తున్నారు. మిగిలిన వాళ్లను తర్వాత రోజు రావాలంటున్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతూ రోజుల తరబడి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ చుట్టూ తిరిగి జనం విసిగిపోతున్నారు. వచ్చిన వాళ్లందరికీ టెస్టులు చేయకపోవడంతో నిలదీస్తున్నారు. తమ చేతుల్లో ఏం లేదని, ప్రభుత్వమే కిట్లు తగ్గించిందని సిబ్బంది చెప్తున్నారు.  వందల్లో జనాలొస్తే పదుల్లో టెస్టులు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పీహెచ్‌‌‌‌‌‌‌‌సీకి రోజుకు 100 మంది టెస్టుల కోసం వస్తున్నారు. ఇక్కడ రోజూ 25–‑30 టెస్టులే చేస్తున్నారు. మిగిలిన వాళ్లకు టోకెన్లు ఇస్తున్నారు. 

వనపర్తి జిల్లా జిల్లా హాస్పిటల్‌‌తో పాటు పీహెచ్‌‌సీల్లో రోజుకు 40 మందికే టెస్టులు చేస్తున్నారు. సింప్టమ్స్ ఉన్న వారిలో కొందరికి టెస్టులు చేయకుండానే మందులు ఇచ్చి పంపుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని పీహెచ్​సీల్లో వచ్చిన వాళ్ల కన్నా తక్కువ మందికే టెస్టులు చేస్తున్నారు. నల్గొండ జిల్లా హాలియా పీహెచ్‌‌సీకి  టెస్టుల కోసం150 మంది రాగా కేవలం 35 మందికే చేశారు. కిట్లు లేక 115 మంది వెళ్లిపోయారు. హాలియాలో పొద్దున 4 గంటలకే జనం క్యూ కడుతున్నారు. జనగామ జిల్లా చేర్యాల అర్బన్‌‌‌‌ హెల్త్ సెంటర్‌‌కు 100 మంది వస్తే 30 మందికే పరీక్షల చేశారు. మెదక్, ఆదిలాబాద్, వరంగల్, సంగారెడ్డి.. అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే కనిపించింది.
సిటీలోనూ తక్కువ టెస్టులే
హైదరాబాద్‌‌లో ఒకేచోట టెస్టింగ్, వ్యాక్సినేషన్ నిర్వహించడం సమస్యగా మారింది. గ్రేటర్ పరిధిలో 120 టెస్టింగ్, 160 వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయి. 42 సెంటర్లను ‘వెలుగు’ విజిట్ చేయగా అందులో ఒకే దగ్గర వ్యాక్సినేషన్‌‌, టెస్టింగ్ ఉన్నవి 25కు పైనే ఉన్నాయి. ప్రతి టెస్టింగ్‌‌ సెంటర్ దగ్గర 60 నుంచి100 లోపే పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని సెంటర్ల దగ్గర కూడా ర్యాపిడ్‌‌ టెస్టులే కనిపించాయి. ఎక్కడా కూడా రోజువారీ టెస్టులు 100కు మించట్లేదు. దుండిగల్ మున్సిపాలిటీలో పీహెచ్‌‌సీ వద్దకు టెస్టుల కోసం రోజూ 150 మంది వస్తే 60 మందికే టెస్టులు చేస్తున్నారు. కొండాపూర్‌‌లో జిల్లా హాస్పిటల్లో టెస్టుల కోసం 200 మందికి చొప్పున టోకెన్లు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ అక్కడ 150 మంది వరకే టెస్టులు జరుగుతున్నాయి. మిగతా వాళ్లంతా స్టాఫ్‌‌కు తెలిసిన వాళ్లని జనం గొడవకు దిగారు. రాయరాయదుర్గం పీహెచ్​సీలో రోజుకు 30 మందికి, శేరిలింగపల్లిలో 70 మందికే టెస్టులు చేస్తున్నారు. శివారు జిల్లాల పరిధిలోనూ టెస్టు కిట్ల కొరత తీవ్రంగా ఉంది.   
వ్యాక్సిన్ల కోసం భయంభయంగా లైన్లల్లో..
వ్యాక్సిన్ల కోసం వస్తున్న వాళ్లలో లిమిటెడ్ టీకాలు, స్లాట్ దొరక్క వెళ్లి పోతున్నవాళ్లే బాగా కనిపించారు. స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియని వాళ్లు ప్రతి సెంటర్ దగ్గర 50 మందికి పైనే కనిపించారు. స్లాట్ ఎట్లా బుక్‌‌ చేసుకోవాలో తెలియక ఆధార్ వివరాలతో హెల్త్ సెంటర్లకు వస్తున్న వాళ్లూ ఉన్నారు. సికింద్రాబాద్, బోయిన్​పల్లి, అడ్డగుట్ట, రాంగోపాల్‌‌పేట్,ఉప్పల్, రామంతాపూర్ ఆస్పత్రులలో వాక్సిన్ల కొతర తీవ్రంగా ఉంది. ఒక్కో ఆస్పత్రి 80 నుంచి 100 వరకే వ్యాక్సిన్లను సప్లై చేస్తుండగా సెంటర్లకు ఒక్కో దగ్గర 200 వరకు వస్తున్నారు. బోయిగూడ అర్బన్​ పీహెచ్‌‌సీకి రోజూ 300 మంది వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ 100 వరకే టీకాలిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌‌లోని సెంటర్ల వద్ద  ఎండలో జనం క్యూ కట్టి కనిపించారు. ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్​ లేకుండా ఆధార్‌‌ కార్డుతో వచ్చిన వాళ్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ వెనక్కి పంపిస్తున్నారు. వ్యాక్సిన్‌‌ కోసం క్యూ కడుతున్న వాళ్లు సోషల్‌‌ డిస్టెన్స్‌‌ అవకాశం లేక భయంభయంగానే లైన్లలో ఉంటున్నారు. జనం భారీగా వస్తుండంతో పాజిటివ్ లేని వాళ్లకూ ఆ క్రౌడ్‌‌తో సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రెండింటినీ వేర్వేరుగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌ చేస్తున్నారు.   
స్లాట్ ఉన్నా వెయిటింగే
సిటీలో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో ప్రతి సెంటర్‌‌కూ 200 మంది వస్తున్నారు. కానీ స్లాట్ దొరికినా షెడ్యూల్ ప్రకారం టీకా వేయట్లేదు.  వివరాల వెరిఫికేషన్‌‌లో టెక్నికల్ సమస్య వల్ల గంటల కొద్ది క్యూ లైన్‌‌లో నిలబడాల్సి వస్తోంది. ‘లాలాపేట్ హెల్త్ సెంటర్‌‌కు వ్యాక్సిన్ కోసం వచ్చి 2 గంటలైంది. క్యూలో 50 మంది ఉన్నారు. వెరిఫికేషన్ కోసం టైం తీసుకుంటున్నారు. తప్పనిసరిగా క్యూలో నిలబడాల్సి వస్తోంది’ అని  మల్కాజిగిరికి చెందిన రాజు యాదవ్ వివరించారు.