
-
కారును వదిలేసి డబ్బుతో పరార్
చేవెళ్ల, వెలుగు: కండ్లలో కారం కొట్టి, రాయితో దాడి చేసి నలుగురు దుండగులు రూ.40 లక్షలను దోపిడీ చేశారు. దోచుకున్న సొమ్ముతో పారిపోతుండగా, వారి కారు బోల్తా పడింది. అనంతరం వారు కారును అక్కడే వదిలేసి డబ్బుతో పరారయ్యారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రాకేశ్ అగర్వాల్ తన తనకు రావాల్సిన రూ.40 లక్షలు తీసుకొచ్చేందుకు తన దగ్గర పనిచేసే మణి, సాయిబాబాను వికారాబాద్‌కు పంపించాడు.
వీరు శుక్రవారం మధ్యాహ్నం వికారాబాద్‌లో రూ.40 లక్షలు తీసుకుని ఫోర్డ్ కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. జిల్లాలోని మాసానిగూడ గ్రామ శివారులో షిఫ్ట్ కారులో ఓ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. హుస్సేన్ పూర్ గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని అడ్డగించారు. కారు నడుపుతున్న మణి కండ్లలో కారం కొట్టి, వెనుక కూర్చుకున్న సాయిబాబాపై రాయితో దాడి చేసి, రూ.40 లక్షలు ఉన్న బ్యాగును లాక్కొని పారిపోయారు.
కారులో పారిపోతున్న క్రమంలో కొత్తపల్లి గ్రామ శివారులో దుండగుల కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టుకు ఢీకొట్టి, బోల్తా పడింది. వెంటనే నిందితులు కారును అక్కడే వదిలేసి డబ్బును తీసుకొని పారిపోయారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్, చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. బోల్తా పడిన కారులో రూ.8.50 లక్షల నగదు, వీవో ఫోన్ దొరికాయి.
నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. సంఘటన స్థలం వద్ద బొమ్మ పిస్తోలు, పుర్రెల దండలు, పసుపు, కుంకుమ, రుద్రాక్షలు, కత్తి, కారంపొడి ప్యాకెట్లు కనిపించాయి. దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ క్షుద్రపూజలు, గుప్త నిధుల తవ్వకాలు చేపడతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకరు అరెస్ట్..
పారిపోయిన నలుగురు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. కారు నడిపిన డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అరంగుడు చేరుకొని, అక్కడి నుంచి జడ్చర్లకు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు అతన్ని ఓ కాఫీ షాప్ వద్ద అరెస్ట్ చేశారు. శంకరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.