ఉప్పొంగిన మానేరు..ఎల్‌‌ ఎండీ వద్ద 10 గేట్ల ద్వారా నీటి విడుదల..వాగులో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహం

ఉప్పొంగిన మానేరు..ఎల్‌‌ ఎండీ వద్ద 10 గేట్ల ద్వారా నీటి విడుదల..వాగులో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహం
  • భూపాలపల్లి, కరీంనగర్‌‌, పెద్దపల్లి జిల్లాల్లో నీటి ప్రవాహం
  •  చిక్కుకున్న ట్రాక్టర్లు, కూలీలు
  • నలుగురిని కాపాడిన పోలీసులు

జయశంకర్‌‌భూపాలపల్లి/చిట్యాల/జమ్మికుంట/ముత్తారం, వెలుగు : భారీ వర్షాలు పడుతుండడంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో మానేరు వాగు ఉప్పొంగింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి, ఓడేడ్‌‌ సమీపంలో ఇసుక కోసం వాగులోకి వెళ్లిన కూలీలు, ట్రాక్టర్లు వరదలో చిక్కుకుపోయాయి. వివరాల్లోకి వెళ్తే... గర్మిళ్లపల్లి, ఓడేడు సమీపంలోని మానేరు వాగు నుంచి ఇసుకను తరలించేందుకు శుక్రవారం ఉదయాన్నే కూలీలు ట్రాక్టర్లతో వెళ్లారు. ఇసుక లోడ్‌‌ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. 

ఒడ్డుకు దగ్గర్లలో ఉన్న కూలీలు, ట్రాక్టర్ల డ్రైవర్లు అప్రమత్తమై ఒడ్డుకు చేరుకోగా.. పది ట్రాక్టర్లు, డ్రైవర్లు పోగు సుమన్‌‌, గాండ్ల రవి, మేరుగు అశోక్‌‌, రామస్వామి వాగులోనే చిక్కుకుపోయారు. వరద ఉధృతి అంతకంతకూ పెరగడంతో వారు బయటకు రాలేకపోవడంతో ట్రాలీలపై నిలబడి ప్రాణాలు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఆర్డీవో రవికుమార్, సీఐ దగ్గు మల్లేశ్‌‌ వాగు వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో నలుగురినీ ఒడ్డుకు చేర్చారు. 

ట్రాక్టర్లను సైతం బయటకు తీసుకొచ్చేందుకు ఎంత ప్రయత్నం చేసినా వీలుకాకపోవడంతో సహాయక చర్యలను నిలిపివేశారు. వరద ఉధృతిని కలెక్టర్‌‌ రాహుల్‌‌ శర్మ పరిశీలించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగుల వద్దకు పశువుల కాపరులు, మత్స్యకారులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

వాగులో చిక్కుకున్న నలుగురిని కాపాడిన కానిస్టేబుల్‌‌ మహేందర్‌‌, హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ సతీశ్‌‌ను సీఐ, ఆర్డీవో సన్మానించారు. అలాగే కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట మండలంలో మానేరు వాగులో ఓ ట్రాక్టర్ చిక్కుకుపోయింది. మిగతా ట్రాక్టర్ల డ్రైవర్లు కలిసి ఇంజిన్‌‌ను బయటకు తీసుకువచ్చారు. 

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలోని ఓ వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌‌ మానేరులో చిక్కుకుంది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు మరో రెండు ట్రాక్టర్లను తీసుకొచ్చి నీటిలో చిక్కుకున్న ట్రాక్టర్‌‌ను బయటకు తీసుకొచ్చారు.

ఎల్‌‌ఎండీ 10 గేట్లు ఓపెన్‌‌

తిమ్మాపూర్, వెలుగు : రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో లోయర్‌‌ మానేరు డ్యాం నిండుకుండలా మారింది. ఓ వైపు మోయ తుమ్మెద వాగు, మరో వైపు మిడ్‌‌ మానేరు నుంచి 36 వేల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. దీంతో ఎల్‌‌ఎండీ ఆరు గేట్లను మూడు ఫీట్ల మేర, మరో నాలుగు గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి ఇన్‌‌ఫ్లో 30 వేల క్యూసెక్కులకు తగ్గిపోవడంతో ఆ మేరకు అవుట్‌‌ఫ్లో తగ్గించారు.