కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని బోల్తా.. 107 మంది మృతి, 146 మంది గల్లంతు..

 కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని బోల్తా.. 107 మంది మృతి, 146 మంది గల్లంతు..

నార్త్ వెస్ట్రన్ కాంగోలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో సుమారు 107 మంది చనిపోగా, 146 మంది గల్లంతయ్యారు. దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవ గురువారం ఈక్వేటర్ ప్రావిన్స్‌లో కాంగో నదిపై మంటల్లో చిక్కుకుని బోల్తా పడిందని కాంగో మంత్రిత్వ శాఖ తెలిపింది.

అదే ప్రావిన్స్‌లో మరో ఘోర ప్రమాదం జరిగిన తరువాత రోజే ఈ విషాదం చోటుచేసుకుంది. బుధవారం బసంకుసులో జరిగిన  పడవ ప్రమాదంలో 86 మంది ప్రాణాలు కోల్పోగా, చాల మంది వాళ్ళు గల్లంతయ్యారు. వరుసగా సంభవించిన ఈ విపత్తుల కారణంగా వారం రోజుల్లోనే మొత్తం మరణాల సంఖ్య దాదాపు 200కు చేరుకుంది.

ఇప్పటికి ఈ ప్రమాదాలకు కారణాలు తెలియకపోగా, అక్కడి రాష్ట్ర మీడియా బుధవారం జరిగిన ప్రమాదానికి రాత్రి సమయంలో  నావిగేషన్ సరిగ్గా లేకపోవడం కారణమని పేర్కొంది.  

ఈ వరుస ఘటనలతో అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ విపత్తుకు ప్రభుత్వమే కారణమని, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందించలేదు.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి, ఇక్కడ మౌలిక సదుపాయాలు సరిగా అలాగే  రోడ్లు లేకపోవడం వల్ల చాలా మంది రవాణా కోసం చెక్క పడవలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ పడవలు శిథిలావస్థకు చేరుకోవడం, లైఫ్ జాకెట్లు వంటి ప్రాథమిక భద్రతా చర్యలు లేకపోవడం, ఎక్కువగా రాత్రిపూట ప్రయాణించడం ఇవన్నీ రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలిగిస్తున్నాయి.