
- పుష్పక్ బస్సుల్లో రూ.50 నుంచి రూ.100 తక్కువ చేసిన ఆర్టీసీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరంలో పుష్పక్బస్సు చార్జీలను తగ్గిస్తూ గ్రేటర్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి, ఎయిర్ పోర్ట్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి సౌలభ్యం కోసం చార్జీలను రూ.50 నుంచి రూ.100 వరకు తగ్గించారు.
ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్‌కు రూ.200 తీసుకుంటుండగా, రూ.100 తగ్గించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆరామ్ ఘర్ వరకు రూ.250 వసూలు చేస్తుండగా, ఇక నుంచి రూ.200 తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి మెహదీపట్నం వరకు రూ.350 చార్జీ కాగా ఇక నుంచి రూ.300 తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి పహాడీ షరీఫ్‌కు రూ.200 కాగా, రూ. 100 చేశారు.
బాలాపూర్‌కు రూ.250 కాగా, తాజాగా రూ.200గా నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ప్రస్తుతం ఉన్న చార్జీల్లోనూ రూ.50 తగ్గించారు. ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ బస్టాండ్, జేఎన్టీయూ, మియాపూర్, లింగంపల్లికి రూ.450 కాగా ఇక నుంచి రూ.400 తీసుకోనున్నారు. ఈ చార్జీలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.