వైరా, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వానివి డైవర్షన్ పాలిటిక్స్ అని, హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం వైరా మున్సిపాలిటీలోని మిట్టపల్లి గార్డెన్స్‌లో నిర్వహించిన మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం విచారణల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలను నిర్వీర్యం చేశారని, సాటిలైట్ సర్వే పేరుతో రైతులకు మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు.
ఫోన్ టాపింగ్ లాంటి అక్రమ కేసులతో కేటీఆర్, హరీశ్‌రావును ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరి బెదిరింపులకు భయపడవని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 9 లోపు అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు, పెన్షన్ పెంపు, మహాలక్ష్మి పథకం, కల్యాణ లక్ష్మి తులం బంగారం, నిరుద్యోగ భృతి లాంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఈ నెల 27 నుంచి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పడ్డ బాకీలను ‘బాకీ కార్డు’ రూపంలో వివరిస్తామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
