ఫీజు రీయింబర్స్మెంట్లో  హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలి : ఆర్. కృష్ణయ్య

ఫీజు రీయింబర్స్మెంట్లో  హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలి :  ఆర్. కృష్ణయ్య
  • రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

కాచిగూడ, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విద్యార్థుల నుంచి వసూలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పీలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కాచిగూడలో 18 బీసీ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైకోర్టు తీర్పు పేద విద్యార్థులకు అన్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దనే ప్రభుత్వ విధానం, అలాగే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించడంలో విఫలమైందని విమర్శించారు.

అడ్వకేట్ జనరల్ అసమర్థత వల్లే ఈ తీర్పు వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని కోర్టుపై నెట్టివేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  బడ్జెట్ కేటాయింపుల్లో కూడా అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.