న్యూఢిల్లీ: ఇండియా యువ స్విమ్మర్ వేదాంత్ మాధవన్ డానిష్ ఓపెన్ టోర్నమెంట్‌లో మరో మెడల్ సొంతం చేసుకున్నాడు. మెన్స్ 800మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో అతను గోల్డ్ మెడల్ సాధించాడు. కోపెన్‌హగెన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 16 ఏళ్ల వేదాంత్ 8 నిమిషాల 17.28 సెకండ్లతో అందరికంటే ముందే పోడియం చేరుకొని మొదటి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తన పర్సనల్ బెస్ట్ టైమింగ్‌ను 11.48 సెకండ్లు మెరుగు పరుచుకున్నాడు. హీరో ఆర్. మాధవన్ కొడుకైన వేదాంత్.. ఇప్పటికే 1500మీ. ఫ్రీస్టయిల్‌లో సిల్వర్ గెలిచాడు. కాగా, మెన్స్ 100మీ. బటర్‌ఫ్లై ఈవెంట్‌లో ఇండియా స్టార్ స్విమర్ సాజన్ ప్రకాశ్ 54.24 సెకండ్లతో ఫైనల్ ‘ఎ’లో ఐదో స్థానంలో నిలిచాడు.

