
- ఢిల్లీ జీటీబీ నగర్ లో కార్మికులతో కలిసి పనిచేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత ముచ్చట్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాపీ మేస్త్రీ అవతారమెత్తారు. గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ లేబర్ చౌక్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓ నిర్మాణ స్థలానికి వెళ్లి పార చేతిలోకి తీసుకుని సిమెంట్ కలిపారు. తాపీతో కొంతసేపు పని చేశారు. అనంతరం కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాహుల్ తమ వద్దకు రావడంతో కార్మికులు సంబరపడుతూ సెల్ఫీలు దిగారు.
ఈ ఫొటోలతో గురువారం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. ‘‘నేను జీటీబీ నగర్ లో పర్యటించాను. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. భారత్ లో మాన్యువల్ వర్కర్లకు వారి స్థాయికి తగ్గట్టుగా గౌరవం లభించడం లేదని నేను గతంలో ప్రస్తావించాను. ఈ పర్యటనలో అది నిజమని తెలిసింది.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ కార్మికులు కనీస రోజువారీ వేతనాలతో బతకడానికి కష్టపడుతున్నారు. ఈ వేతనాలకు కూడా గ్యారంటీ లేదు. భారత్ లోని కార్మికులకు పూర్తి హక్కులతో పాటు తగిన గౌరవం లభించేలా చూడటమే నా జీవిత లక్ష్యం” అని తెలిపారు.