
- కన్నాల గేట్ వద్ద ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మాణానికి రైల్వే శాఖ ఓకే
- ఎంపీ వంశీకృష్ణ లెటర్‌తో స్పందించిన రైల్వే అధికారులు
- ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మాణానికి ఓకే చెబుతూ ఎంపీకి తిరిగి లేఖ
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పాలకుర్తి మండలం కన్నాల గ్రామస్తుల రైల్వే ఫ్లై ఓవర్ కష్టాలు తీరనున్నాయి. రాఘవపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కన్నాల గేట్ వద్ద రైల్వే ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మించేందుకు ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 28న దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్థానిక ఎంపీ వంశీకృష్ణకు లెటర్ రాశారు.
దీంతో ఇక్కడ ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మాణానికి రైల్వే శాఖ రూ.86.12కోట్లు కేటాయించేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు రైల్వే అధికారులు సమాధానమిచ్చారు. దీంతో పాలకుర్తి మండల ప్రజల రైల్వే గేట్ కష్టాలు తీరనున్నాయి. ఇందుకు కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
గేట్పడితే అరగంటపాటు ఎదురుచూడడమే
పెద్దపల్లి జిల్లా మీదుగా ప్రస్తుతమున్న రైల్వే మార్గం ఉత్తర, దక్షిణ భారతదేశానికి ఎంతో కీలకం. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. బసంత్‌నగర్ రాజీవ్ రహదారి నుంచి కన్నాల గ్రామం మీదుగా రాణాపూర్, కమాన్‌పూర్, గుంటూరుపల్లి, సబ్బితం, ఎల్కలపల్లి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, గోదావరిఖని ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే ట్రాక్‌ను దాటాల్సి ఉంటుంది.
ఈ మార్గం నిత్యం బిజీగా ఉండడంతో కన్నాల వద్ద ఉన్న రైల్వే గేట్(46-ఈ/ఏ) ఎక్కువ సమయం క్లోజ్ చేసే ఉంటుంది. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ పనులకు వెళ్లే వారితోపాటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గేట్ పడితే కనీసంగా అరగంట పాటు వేచి ఉండాల్సి వస్తుంది.
గేటు కష్టాలపై ఎంపీ లెటర్
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పాలకుర్తి మండలం కన్నాల గ్రామం వద్ద గల రైల్వే గేట్‌తో ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులు, అత్యవసర సేవలకు ఆటంకాలను నివారించేందుకు అక్కడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేదా అండర్ పాస్ నిర్మించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే అధికారులకు ఏప్రిల్‌లో లెటర్ రాశారు. ఎంపీ లెటర్‌కు సౌత్‌సెంట్రల్ జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ స్పందించారు. కన్నాల గేట్ వద్ద ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మించేందుకు రైల్వే శాఖ మే 6న ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్’గా రూ.86.12కోట్లు విడుదలకు ఓకే చెప్పిందని, ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఎంపీ వంశీకృష్ణకు ఇటీవల లెటర్ పంపించారు.
బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కాలేమని తెలపడంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రైల్వే శాఖ నిధులతోనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే జీఎం లెటర్‌లో తెలిపారు. ప్రస్తుతం టెండర్ దశలో ఉండగా 2028–-29 నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.