
No Charges on Luggage in Trains: త్వరలోనే దీపావళి వస్తోంది. చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్లటానికి ఇప్పటికే టిక్కెట్లు బుక్కింగ్ చేసుకుంటున్నారు. దీని తర్వాత వచ్చే దసరాకు కూడా బుక్కింగ్స్ ప్లాన్ చేస్తున్నారు చాలా మంది. అయితే రైళ్లలో ప్రయాణానికి లగేజీపై లిమిట్స్ ఉన్నాయని.. అవి దాటితే అదనపు ఛార్జీలు ఉంటాయని ఈవారం వచ్చిన వార్తలు ప్రయాణికులను కలవరానికి గురిచేశాయి.
ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికుల నుంచి విమానాల్లో మాదిరిగా అదనపు లగేజీపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంత పరిమితి దాటితే ఎలాంటి చార్జీలు ఉంటాయనే వివరాలతో కూడిన వార్తలు ప్రచురితమయ్యా. వాస్తవానికి ఇది రైలు ప్రయాణికులను కొంత ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. అసలు భారతీయ రైల్వే సంస్థ అలాంటి ఆలోచన చేయలేదని.. అదనపులగేజీపై ఎలాంటి ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే ప్రణాళికకు తాము ఆమోదించలేదని చెప్పారు. దీనికోసం ఎలాంటి కొత్త నిబంధనలను అసలు ప్రతిపాదించలేదని క్లారిటీ ఇచ్చారు.
ALSO READ : భారత్‌లో ఐఫోన్ల తయారీపై చైనా కుట్ర
దశాబ్ధాలుగా కొనసాగుతున్నట్లుగానే రైళ్లలో ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీపై ఎలాంటి పరిమితులు లేదా షరతులను రైల్వే శాఖ తీసుకురావటం లేదని హామీ ఇచ్చారు. ఎక్కువ బరువు ఉన్న వస్తువులను తీసుకెళితే పరిమితికి మించిన దానిపై అదనపు ఛార్జీలు అనే వార్తలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపడేశారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. దీంతో రైలు ప్రయాణికులు పెద్ద ఊరట పొందుతున్నారు.