వానలు కురవాలని గ్రామాల్లో పూజలు

 వానలు కురవాలని గ్రామాల్లో పూజలు
  • ముఖం చాటేసిన వరుణుడి కోసం ఎదురుచూపులు

నారాయణపేట జిల్లా: రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రైతులంతా వ్యవసాయ పనుల్లో బీజీ అయిపోయారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా.. ప్రస్తుత నారాయణపేట జిల్లాలో మాత్రం వరుణ దేవుడి కటాక్షం కోసం జనం పూజలు చేస్తున్నారు. ముఖం చాటేసిన వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురవాలని గ్రామాల్లో పూజలు చేస్తున్నారు. 
పొలాలను దుక్కి దున్ని తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాన దేవుడు కనికరించలేదు. వర్షాల కోసం రైతులకు ఎదురుచూపులు చూస్తున్నారు. జూన్ నెలంతా గడిచిపోయింది. జూలై నెలలోకి అడుగుపెట్టినా అనుకున్న స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వరుణ దేవుడి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ కలత చెందుతున్నారు. నెల రోజులుగా ఆశించిన వర్షాలు లేకపోవటంతో నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామంలో వారం రోజులుగా వరుణ దేవుడికి పూజలు చేస్తున్నారు.

ఆలయంలో జలాభిషేకాలు

వర్షం మీదే ఆధారపడే పంటల విత్తనాలు వేసేందుకు ఎదురుచూస్తున్నారు రైతులు. సీజన్ దాటిపోతుండడంతో వర్షాభావ పరిస్థితులు తీవ్ర నిరాశ మిగిలుస్తున్నాయి. దీంతో వర్షం కోసం జనం పూజలు చేస్తున్నారు. బిజ్వార్ గ్రామంలో వారం రోజులుగా రోజుకో తీరుగా పూజలు  చేస్తున్నారు. మొదట గ్రామంలో పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆలయంలో జలాభిషేకాలు చేశారు. ఆ మరుసటి రోజు ఊరంతా కలిసి వన భోజనాలు చేశారు. గ్రామంలో ప్రజలు ఇంటింటికి తిరిగి బియ్యం, డబ్బులు బిక్షాటన చేశారు. అంతేకాక స్మశాన వాటికలోని బొందల దగ్గర నీళ్లు పోసి పూజలు చేశారు.ఇలా పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయన్నది స్థానికుల నమ్మకం.