
రాజస్థాన్‌లో ఒక కారు ఓనర్ తనకి టెక్నికల్ సమస్య ఉన్న కారును అమ్మారని ఆరోపిస్తూ హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ, హ్యుందాయ్ డీలర్, హ్యుందాయ్ అధికారులు సహా బ్రాండ్ అంబాసిడర్లైన షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనేలపై కేసు పెట్టారు.
వివరాలు చూస్తే రాజస్థాన్‌లోని భరత్‌పూర్ అనిరుద్ధ్ నగర్‌కు చెందిన 50 ఏళ్ల కీర్తి సింగ్ ఈ కేసు వేశారు. పోలీసులు మొదట కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. దింతో కోర్టు ఆదేశాల మేరకు మధుర గేట్ పోలీస్ స్టేషన్ ఆగస్టు 25న భారతీయ శిక్షాస్మృతిలోని 420, 406, 120B సెక్షన్‌లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని 312, 318, 316, 61, 175(3) సెక్షన్‌ల కింద కేసు బుక్ చేసింది.
భరత్‌పూర్‌లోని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు తన పిటిషన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజింగ్ డైరెక్టర్, COO, సేల్స్ MD, డైరెక్టర్ పేర్లను పేర్కొన్నారు. బ్రాండ్‌ను ప్రోమోట్ చేసిన దీపికా పదుకొనే, షారుఖ్ ఖాన్ పేర్లను కూడా నిందితులుగా చేర్చాడు.
కీర్తి సింగ్ ప్రకారం 20202లో హ్యుందాయ్ అల్కాజార్ కారును కొన్నానని, కొనడానికి ముందు కంపెనీ ప్రతినిధి ఇంటికి వచ్చి సంప్రదించి అడ్వాన్స్ కింద రూ. 51వేలు తీసుకున్నారని తరువాత మిగిలింది లోన్ రూపంలో కట్టినట్లు చెప్పాడు. కారులో ఎలాంటి సమస్యలు లేవని డీలర్‌షిప్ హామీ ఇస్తూ, ఏదైనా లోపం ఉంటే బాధ్యత వహిస్తామని చెప్పినట్లు కూడా ఆరోపించారు. అయితే కార్ కొన్న వెంటనే కారులో టెక్నికల్ లోపాలు బయటపడ్డయని, యాక్సిలరేట్ చేసినపుడు ఇంకా ఓవర్‌టేక్ చేసేటప్పుడు కార్ RPM పెరగకుండానే వైబ్రేట్ అవుతుందని, స్క్రీన్ పై ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనిచేచేయట్లేదని చూపిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమస్య గురించి కంపెనీకి చెప్పినపుడు పాటించుకోవట్లేదని, కార్ లోపాలను దాచిపెట్టి హ్యుందాయ్ అధికారులు కుట్ర పన్నారని, కస్టమర్లను మోసం చేస్తున్నారని సింగ్ ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మధుర గేట్ పోలీసులు తెలిపారు. అలాగే అందించిన వివరాల, స్టేట్‌మెంట్‌ల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.