ఆదిపురుష్‌ ఎఫెక్ట్.. రామాయణం సీరియల్ రీ టెలికాస్ట్‌

ఆదిపురుష్‌ ఎఫెక్ట్.. రామాయణం సీరియల్ రీ టెలికాస్ట్‌

ఆదిపురుష్‌.. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  ఈ సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజైనప్పటీ నుంచే ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సినిమాను చూసిన నెటిజన్స్ ... ముందుగా రామాయణాన్ని తీయాలనుకునే ఎవరైనా సరే ముందుగా  రామాయణం సీరియల్‌ను ఓసారి చూడాల్సిందంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.  

ఆదిపురుష్‌ సినిమాలోని పాత్రలను సీరియల్‌లోని పాత్రలతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు. మరోసారి ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో షెమారూ టీవీ ఛానల్‌  రెస్పాండ్ అయింది.  జులై 3 నుంచి రామాయణం సీరియల్‌ను రీ టెలికాస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 7.30 నిమిషాలకు ప్రసారం చేయనున్నట్లు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను పెట్టింది. 

రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణంలో రాముడిగా అరుణ్ గోవిల్ సీతగా దీపికా చిక్లియా, అలాగే లక్ష్మణుడి పాత్రలో సునీల్‌ లహ్రీ నటించి మెప్పించారు. రామాయణం సీరియల్  రీ టెలికాస్ట్‌ అవ్వడం ఇది రెండో సారి కావడం విశేషం. 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గం.లకు దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ ప్రసారమయ్యేది. ఆ తర్వాత కొవిడ్‌ సమయంలో దీనిని రీ టెలికాస్ట్‌ అయింది. 2020లో మార్చి 28 నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రసారమైంది. అప్పుడు ఏకంగా దీన్ని 7.7కోట్ల మంది చూశారు.  

రామానంద్ సాగర్ రామాయణంలో లక్ష్మణ్‌గా నటించిన నటుడు సునీల్ లహరి ఆదిపురుష్‌ సినిమా గురించి మాట్లాడుతూ, "నేను సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నేను చాలా నిరాశకు గురయ్యాను. నా మదిలో మెదిలిన ఆలోచన ఏమిటంటే, నేను సినిమా చూడటానికి ఎందుకు వెళ్లానా అని...  చిత్రం నాకు అస్సలు నచ్చలేదు. సినిమాలో నాకు నచ్చిన రెండు విషయాలు మాత్రమే చెప్పగలను -- నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ. ఈ రెండు అంశాలను మినహాయించి, సినిమా నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది." అని ఆయన చెప్పారు.