ఆర్టీఏ ఆఫీసులో రవితేజ సందడి

ఆర్టీఏ ఆఫీసులో  రవితేజ సందడి

మాస్ మహారాజా ‘రవితేజ‘ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులోసందడి చేశారు. ఇటీవల ఎలక్ట్రిక్ కారు(ఈవీ)ని కొనుగోలు చేసిన రవితేజ..దాని రిజిస్ట్రేషన్‌ నిమిత్తం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు విచ్చేశారు. దీంతో అక్కడ అభిమానుల కోలాహలం నెలకొంది. రవితేజ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆర్టీఏ ఆఫీస్ ప్రాంగణం కాసేపు ‘మాస్ మహారాజ్..’ అనే డైలాగులతో దద్దరిల్లింది. 

రవితేజ ఇటీవల BYD ATTO 3 అను ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనుగోలు చేశారు. దీని ఖరీదు దాదాపు 34 లక్షల 49 వేల రూపాయిలు. ఈ కారు రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. అంతే కాదు ఈ వాహనానికి సంబంధించి ‘TS09GB2628‘ అనే ఫ్యాన్సీ నంబర్‌ కోసం వేలం పాటలో పాల్గొని 17,628 రూపాయలకు దాన్ని సొంతం చేసుకున్నారు. ఇక రవితేజ రీసెంట్ గా కొనుగోలు చేసిన కారులో ప్రత్యేకమైన సదుపాయాలు చాలానే ఉన్నాయి. చైనాకు చెందిన ఈ కారు అత్యంత సురక్షితమైందిగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది.

ఇక ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాదు ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే.. మాస్ మహారాజ్ నటించిన రీసెంట్ మూవీ ‘రావణాసుర’ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం అతను టైగర్ నాగేశ్వర్ రావు అనే పీరియాడిక్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.