
- ఆర్థిక అక్షరాస్యతతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
- ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్
గజ్వేల్/సిద్దిపేట రూరల్, వెలుగు: గ్రామీణ ప్రజలు ఆర్థిక నైపుణ్యం సాధించేలా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చర్యలు చేపడుతోందని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో, నారాయణరావుపేట మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ వినియోగదారులు, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించగా చిన్మయ్‌కుమార్ చీఫ్‌గెస్ట్‌గా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు రుణాలు, ఆర్థిక ఉత్పత్తులు, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక రక్షణ, బీమా, పెన్షన్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణులకు చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని, గ్రామీణుల్లో ఆర్థిక నైపుణ్యత లక్ష్యంగా ఆర్బీఐ చర్యలు చేపట్టిందన్నారు. గ్రామీణ మహిళలు ఆర్థిక భవిష్యత్‌ను నిర్మించుకోగలుగుతారని పేర్కొన్నారు. ఖాతాదారులు డిజిటల్ లావాదేవీలు చేపట్టాలన్నారు. బ్యాంకుల్లో వినియోగంలో లేని ఖాతాలను రద్దు తీసుకోవాలని, లేదంటే ఆ ఖాతాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఆర్బీఐ రీజనల్ డైరక్టర్ చిన్మయి, జనరల్ మేనేజర్ సుప్రభాత్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గోమతి, యూనియన్ బ్యాంక్ డీజీఎం అరవింద్, రీజనల్ హెడ్ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఉదయ్ కిరణ్, స్థానిక బ్రాంచ్ మేనేజర్లు నర్సింహులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.