ఇక టీజీఎస్ ఆర్టీసీ .. టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్

ఇక టీజీఎస్ ఆర్టీసీ  ..  టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ ను టీజీతోనే చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా టీజీతోనే రిజిస్టర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ లోగో, పేరులో మార్పులు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​(టీఎస్​ ఆర్టీసీ)ని టీజీఎస్​ఆర్టీసీగా మార్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్​నోటిఫికేషన్​ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా తెలంగాణ ట్రాన్స్​పోర్ట్​ అథారిటీ కూడా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్​కు మార్చి 15వ తేదీ నుంచే టీజీ అమలు చేస్తున్నది. తాజాగా ఆర్టీసీ బస్సులకు సైతం టీజీ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో ఇకపై ఆర్టీసీ బస్సులను కూడా టీజీ సిరీస్​తోనే రిజిస్ట్రేషన్ చేయించనున్నట్టు చెప్పారు. 

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9,067 ఆర్టీసీ బస్సులు ఉండగా, వాటిలో 90 శాతం బస్సులు ఏపీ సిరీస్​తోనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొనుగోలు చేసిన బస్సులను మాత్రం టీఎస్​ సిరీస్​తో రిజిస్ట్రేషన్​ చేయించారు. కాగా, త్వరలో టీఎస్​ఆర్టీసీ లోగోలో కూడా మార్పు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందులో టీఎస్ ఆర్టీసీ స్థానంలో టీజీఎస్​ఆర్టీసీ అని ఉంటుందని, లోగో డిజైన్​ కూడా కొంత మారే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే నెలాఖరు నాటికి దాదాపు 500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.