ఏపీ ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ తొలగింపు

ఏపీ ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ తొలగింపు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో ఈ ఏడాది ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజ్ తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రతీ ఏటా ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్ పరీక్షకు 25 శాతం వెయిటేజ్ ఇస్తున్న విషయ తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దు చేసి అందర్నీ పాస్ చేసిన నేపధ్యంలో ఈ ఏడాది ఏపీ ఎంసెట్ లో వెయిటేజ్ తొలగిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) 2021ను వచ్చే ఆగస్టు నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఎంసెట్ గా పిలిచే ఈ పరీక్షను ఈ ఏడాది నుంచి ఎం అనే పదం తొలగించినందున ఈఏపీసెట్-21 గా మార్పు చేశారు. ఫార్మసీ ప్రవేశాలను కూడా ఈ పరీక్ష ద్వారానే నిర్వహిస్తున్నందున ఎం అనే పదం స్థానంలో పీ అనే పదం చేర్చి ఈఏపీసెట్ గా  మార్పు చేస్తు ఇది వరకే ఉత్తర్వులు ఇచ్చారు.