యాదిలో.. ప్రాచీన భారతదేశ సుప్రసిద్ధ రాజు.. దేశాన్ని పాలించడం కష్టం..థానేసర్ రాజైన హర్షుడు ఎలా పాలించాడంటే..!

యాదిలో.. ప్రాచీన భారతదేశ సుప్రసిద్ధ రాజు.. దేశాన్ని పాలించడం కష్టం..థానేసర్ రాజైన హర్షుడు ఎలా పాలించాడంటే..!

క్రీ. శ 7వ శతాబ్దంలో థానేసర్ రాజైన ప్రభాకర వర్ధనుడికి రాజ్య, హర్ష అనే కొడుకులున్నారు. ప్రభాకరుడి మరణానంతరం మాళ్వ రాజైన కర్ణసువర్ణుడు రాజ్యను చంపించాడు. అప్పటికి హర్షుని వయసు 16 ఏండ్లే. ఆయన బౌద్ధమతంలో చేరబోయే టైం అది. ‘రాజ్య’ మరణవార్త థానేసర్​కు చేరగానే మంత్రులు, న్యాయాధీశులు వెంటనే హర్షుణ్ని రాజుగా నియమించాలని కబురు పంపారు. 

అందుకా యువరాజు సవినయంగా ‘‘ఒక దేశాన్ని పరిపాలించడం అనేది బాధ్యతాయుతమైన, కష్టసాధ్యమైన విషయం. దాన్ని అంగీకరించడానికి ముందు నేను గంగానదీతీరాన ఉన్న అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన బుద్ధ విగ్రహాన్ని సంప్రదించాలి” అని జవాబిచ్చాడు. ఆయన అక్కడికి వెళ్లి, ఉపవాసంతో ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి థానేసర్ కిరీటం ధరించి, కనౌజ్​ వారత్వాన్ని పొందాడు. దాన్నే ఆయన రాజధానిగా చేసుకున్నాడు. 

ఐదేండ్ల వరకు ఆయన తన సైనిక దళాలను అవిధేయులైన వారినందరినీ అణచివేస్తూ తూర్పు నుంచి పడమర వరకు నడిపించాడు. ఆరేండ్లపాటు సమర్థవంతంగా యుద్ధాలు చేశాడు. 30 ఏండ్లు ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన సామ్రాజ్యం గంగానది ముఖద్వారం నుంచి గంగా మైదాన ప్రాంతమంతా వ్యాపించాయి. 

పశ్చిమాన సట్లెజ్​, మధ్య భారతదేశం, గుజరాత్​, కథియావాడ్​ వరకు ఉంది. ఆయన ‘పంచ ద్వీపాల సార్వభౌముడు’ అనే బిరుదు పొందాడు. తర్వాత దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కానీ, అక్కడ చాళుక్య రాజు రెండవ పులకేశి చేత భంగపడ్డాడు. చైనా యాత్రికుడు హ్యూయెన్ త్యాంగ్​ ఈ ఇద్దరు చక్రవర్తుల గురించి ఎంతో గొప్పగా అభివర్ణించాడు. తన యాత్రలో భాగంగా సందర్శించిన హిందూ దేవాలయాలు ఆయనలో మతసంబంధమైన ఆసక్తిని పెంచాయి. 

పరమత సహనం ఎక్కువ అయింది. శివుడు, విష్ణువును బహిరంగంగానే బుద్ధునిలా పూజించేవాడు. దాంతో పీడిత హిందువులు, బౌద్ధ సన్యాసుల మధ్య ఘర్షణ మొదలైంది. ఒక సందర్భంలో రాజభవన సింహద్వారం దగ్గర ఉన్న పూరి మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏం జరిగిందో చూడ్డానికి వెళ్లిన హర్షుడి మీదికి దుండగుడు కత్తిదూశాడు. అప్పుడు హర్షుడు అతన్ని పట్టుకుని ఆయుధం తీసేసి, అతన్ని ఏం చేయొద్దని చెప్పి న్యాయాధికారులకు అప్పగించాడు. 

అతడు తనను బ్రాహ్మణులు కిరాయికి తీసుకున్నారని, రాజు బౌద్ధ సన్యాసుల పట్ల చూపించే పక్షపాతానికి వారు అసూయపడి ఈ పనిచేయమన్నారని చెప్పాడు. ఆ కుట్రదారులు సమావేశ మందిరాన్న తగులబెట్టి హర్షుణ్ణి అంతమొందించాలనుకున్నారు. కానీ, మంటలు వ్యాపించలేదు. దీంతో వాళ్లు కిరాయి హంతకుడిని పంపారని ఒప్పుకున్నాడు.

 హ్యూయెన్ త్యాంగ్ వెళ్లిపోయాక ఆయన ఒక బ్రాహ్మణున్ని చైనా రాజు కొలువుకు పంపాడు. అతని తిరుగు ప్రయాణంలో చైనా చక్రవర్తి ఒక ఉన్నత ప్రభుత్వోద్యోగిని కనౌజ్​కు పంపించాడు. హర్షుడు ఆ రాయబారికి బహుమతులిచ్చాడు. అతను వెళ్తుండగా అర్జునుడు తిరుగుబాటు దాడితో రాజును చంపి, ఉద్యోగిని బంధించి, సంపదను హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అతడు నేపాల్​కు పారిపోయాడు. అక్కడ అతడు చైనా చక్రవర్తి అల్లుడైన టిబెట్​ రాజుకు ఫిర్యాదు చేశాడు. వెంటనే టిబెట్​ సైన్యం ఇండియాను ముట్టడించి అర్జునుడిని చంపేసింది. 

హర్షుడికి వారసులు లేనందున రెండు దశాబ్దాలపాటు ఇండియా అంధకారంలో ఉంది. ఆ తర్వాత మనదేశం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ బౌద్ధమతం అంతరించిపోయింది. ఉపఖండం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అంధకార సమయంలో మధ్య ఆసియా యుద్ధ వీరులు, హూణులు, గుజరాతీలు వంటివాళ్లతో ఇండియా హిందూమతంలోకి పూర్తిగా చేరింది. వాళ్లను వాళ్లు రాజపుత్రులు, రాజుల కొడుకులుగా ప్రకటించుకున్నారు. రాజపుత్రులను హిందూపురాణ పురుషుల వంశానికి చెందినవారిగా తేల్చారు. 

- మేకల మదన్​మోహన్​ రావు, కవి, రచయిత-