త్వరలో రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల పునర్ వ్యవస్థీకరణ

త్వరలో రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల పునర్ వ్యవస్థీకరణ

హైదరాబాద్, వెలుగు : త్వరలో రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఇటీవల ఈ రెండు శాఖలపై సీఎం కేసీఆర్ రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాలకు ఎస్ఈలను నియమించాలని, శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేపట్టాలని, ఇందుకు ప్రపోజల్స్ రెడీ చేసి, వెంటనే టెండర్లు పిలవాలన్నారు. ఇందుకు అనుగుణంగా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు అధికారులతో రివ్యూ చేపట్టి పలు సూచనలు చేశారు. ఈనెల 15 కల్లా రోడ్ల రిపేర్లకు టెండర్లు పిలవాలన్నారు.

కొత్త జిల్లాలకు ఎస్ఈల నియామకం

రాష్ట్రంలో ఆర్ అండ్ బీ తరఫున ఉమ్మడి జిల్లాలకు ఎస్ఈ ( సూపరింటెండెంట్ ఇంజినీర్లు)లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో 10 జిల్లాలను ప్రభుత్వం 33 జిల్లాలు చేసింది. అయితే, ప్రభుత్వం కొత్త జిల్లాలకు ఎస్ఈలను నియమించలేదు. కనీసం ఇన్ చార్జ్ ఎస్ఈలను కూడా నియమించకపోవడంతో ఉమ్మడి జిల్లాల ఎస్ఈలు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో కొత్తగా ఎక్కువ జిల్లాలు ఏర్పడ్డాయి. వీటితో పాటు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు విస్తీర్ణం పరంగా పెద్దగా ఉండడంతో ఆ జిల్లాల్లో పర్యటించడం భారంగా మారుతోంది. నిత్యం తనిఖీలు, రివ్యూలతో కలెక్టర్లు, హైదరబాద్​లో రివ్యూలకు అటెండ్ కావడానికి తీవ్ర ఇబ్బంది అవుతోందని ఎస్ఈలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం కొత్త జిల్లాలకు ఎస్ఈలను నియమించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆర్ అండ్ బీ లో ఇపుడు ఉన్న 10 మంది ఎస్ఈలకు అదనంగా మరో 6 లేదా ఏడుగురు అధికారులు రానున్నట్లు అధికార వర్గాల సమాచారం. పంచాయతీ రాజ్ ఈఎన్సీ పరిధిలో సైతం ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం కనపడుతోంది.

ఎస్ఈలకే నిధుల ఖర్చు పవర్​

స్టేట్​లో ఎక్కడ రోడ్లు డ్యామేజ్ అయినా హైదరాబాద్ లోని ఈఎన్సీ ఆ రిపేర్​కు అప్రూవ్ ఇస్తున్నారు. దానికి ఖర్చు ఎస్టిమేట్, బడ్జెట్, టెండర్ తదితర అంశాలను ఈఎన్సీ జిల్లా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే ఆనవాయితీ ఉండేది. ఈ ప్రక్రియలో మార్పులు చేయాలని ఇటీవల అధికారులను సీఎం ఆదేశించారు. చిన్న చిన్న రిపేర్లకు, తక్కువ ఖర్చు అయ్యే పనులకు జిల్లా స్థాయిలో ఉండే ఎస్ఈ నిర్ణయం తీసుకునేలా మార్పులు చేయాలని సీఎం కోరారు.

3 లేదా 4 కానిస్టెన్సీలకు టెర్రిటోరియల్ ఎస్ఈలు

రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగినందున, కొన్ని ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నందున టెర్రిటోరియల్ ఎస్ఈలుగా పలువురు అధికారులను నియమించాలని సీఎం అధికారులకు సూచించారు. 3 లేదా 4 నియోజకవర్గాలకు కలిపి ఒక టెర్రిటోరియల్ ఎస్ఈ ఉండేలా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్​లో రీ ఆర్గనైజేషన్ లో మార్పులు చేయనున్నారు.

సీఎం వద్దకు ప్రపోజల్స్

సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల రీ ఆర్గనైజేషన్ ప్రాసెస్ పూర్తయినట్లు తెలిసింది. ఈ రెండు శాఖల ఈఎన్సీలు, సీఈలు సమావేశమై ప్రమోషన్లు, కొత్త ఎస్ఈల పోస్టులపై పలుమార్లు చర్చించి, సెక్రటరీలు శ్రీనివాస్ రాజు, రఘనందన్ రావుల సూచనలతో ఫైనల్​చేశారు. వీటిని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు పరిశీలించి సీఎం వద్దకు పంపించినట్టు తెలిపారు. సీఎం మార్పులు చేర్పులు సూచిస్తే అందుకు అనుగుణంగా మారుస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 2వ వారం కల్లా రెండు శాఖల రీ ఆర్గనైజైషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం అసెంబ్లీకి ముందు జరిగే కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోద ముద్ర పడే అవకాశముందని తెలిపారు. కేబినెట్ ఆమోదం తర్వాత పలువురు అధికారులకు సీఈలు, ఎస్ఈలుగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు.