తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల విరామం తర్వాత శుక్రవారం ( జనవరి 2 ) తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో ప్రభుత్వం ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. దీంతో సమావేశాలు వాడివేడిగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మాట్లాడుతూ మూసీ సుందరీకరణపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్ళు కూలగొట్టద్దని అన్నారు హరీష్ రావు. మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో చెప్పాలని అన్నారు.
సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేవంటున్న ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని అన్నారు. మూసీ సుందరీకరణ కోసం ఒకసారి లక్ష కోట్లు, మరొకసారి లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని అంటున్నారని అన్నారు హరీష్ రావు. మూసీకి గోదావరి నీళ్లు తెస్తామని ప్రభుత్వం అంటోందని.. వాటి టేకింగ్ పాయింట్ ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తారా..?, ఇంకెక్కడి నుంచైనా తెస్తున్నారా అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా 32 ఎస్టీపీలు తెచ్చామని... ఇప్పుడు ఆ ఎస్టీపీలు పనిచేయకపోవడంతో వికారాబాద్ మురికి నీరు గండిపేట హిమాయత్ సాగర్ లోకి వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని ప్రశ్నించారు హరీష్ రావు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ళు కూల్చితే బీఆర్ఎస్ ఊరుకోదని.. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుందామని గతంలోనే చెప్పామని అన్నారు హరీష్ రావు.
