- కొత్తగూడెం కార్పొరేషన్, మున్సిపల్ ఓటర్లు 1, 85,750 మంది
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల్లో గురువారం ముసాయిదా జాబితాను నోటీసు బోర్డులో అంటించారు. దీనిపైఅభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ జాబితాను 10న రిలీజ్ చేయనున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో మొత్తం ఓటర్లు 1,85,750మందిగా నమోదయ్యారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీలో అతి తక్కువగా 16,850 మంది ఓటర్లు నమోదయ్యారు. ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి, వైరా, ఎదులాపురం కల్లూరు మున్సిపల్ కార్యాలయాల్లో జాబితాను నోటీసు బోర్డుపై ప్రదర్శించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టింది.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు రాజకీయ పార్టీలతో సమావేశాలను ఆఫీసర్లు నిర్వహించనున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు, ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులు, అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22వార్డులకు, వైరా మున్సిపాలిటీలో 20, కల్లూరులో 20, మధిరలో 22, సత్తుపల్లి మున్సిపాలిటీలో 20 వార్డులకు సంబంధించి ఓటరు ముసాయిదాను ఆఫీసర్లు ప్రకటించారు.
