హిందూ పంచాంగం ప్రకారం ప్రతి పౌర్ణమికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. పురాణాల ప్రకారం పుష్యమాసం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన రోజు. జ్యోతిష్యం ప్రకారం పౌర్ణమి తిథి చంద్రుడికి చాలా ఇష్టం. సూర్య చంద్రులకు ఇష్టమైన పుష్య పౌర్ణమి రోజు ఎప్పుడు వచ్చింది.. ఆరోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పంచాంగం ప్రకారం, పుష్య మాసం పూర్ణిమ తిథి జనవరి 2వ తేదీ సాయంత్రం 06:53 గంటలకు ప్రారంభమై.. జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 03:32 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం..పుష్య పౌర్ణమిని జనవరి 03, శనివారం నాడు పాటిస్తారు. పవిత్ర నదీ స్నానాలు, దానధర్మాలు జనవరి 3న ఆచరించాలి.
పురాణాల ప్రకారం, ఈ రోజున పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కాశీ, హరిద్వార్, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో ‘గంగా స్నానం’ చేయడం మోక్షదాయకంగా భావిస్తారు. ఈ పౌర్ణమితోనే ప్రసిద్ధ మాఘ స్నానాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున సూర్య-చంద్రులను ఏకకాలంలో ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
దగ్గరలో జీవనదులు.. పుణ్య నదుల్లో స్నానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది. అదీ కూడా అవకాశం లేనివారు.. బావి దగ్గర కాని.. కుళాయి దగ్గర కాని స్నానం చేయాలి. ఇలా చేసేటప్పుడు ఇంట్లో గంగా జలం ఉంటే అందులో కొద్దిగా కలుపుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రం పఠించాలి.
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
తరువాత దేవుడి మందిరంలో ఆవునెయ్యుతో దీపారాధన చేసి .. విష్ణుమూర్తి.. లక్ష్మీదేవిని పూజించాలి. సూర్యనమస్కారాలు చేస్తే ఈ క్రింది మంత్రం పఠించాలి.
బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం l
సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ll
పుష్య పౌర్ణమి రోజున ( జనవరి3) లక్ష్మీదేవిని పసుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు. కొన్ని ప్రాంతాల్లో శాకంబరీ దేవి జయంతిని కూడా జరుపుకుంటారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించి పూజిస్తారు. అమ్మవారి దేవాలయాల్లో అలంకరణ సామాగ్రిని ఇవ్వాలి. అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే కష్టాలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.
ఏం చేయకూడదంటే..
సూర్యోదయం వరకు నిద్రపోవడం : పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజలు చేయడం శుభకరం. సూర్యోదయం వరకు నిద్రపోతే అదృష్టం మందగిస్తుందని నమ్మకం. ఇది ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని పండితులు చెబుతున్నారు.
గొడవలు, వాదనలు : ఇంట్లో ఎవరికైనా కోపపడటం, తగాదాలు పెట్టుకోవడం ఈ రోజున అశుభం. ఇది ఇంటి సానుకూల శక్తిని తగ్గిస్తుందని భావిస్తారు. కుటుంబ సంబంధాలు చెడిపోవడం, ఆర్థిక ఒత్తిళ్లు పెరగడం వంటి పరిణామాలు రావచ్చని చెబుతారు.
తామస ఆహారం తీసుకోవడం : మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామస ఆహారాన్ని నివారించాలి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసుకు శాంతి, శరీరానికి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం.
రుణ లావాదేవీలు : ఈ రోజున డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదని భావిస్తారు. ఇది డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటుందని, ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
