రిజర్వేషన్లపై ఉత్కంఠ !.. గ్రామాల్లో వేడెక్కిన రాజకీయాలు

రిజర్వేషన్లపై ఉత్కంఠ !..  గ్రామాల్లో వేడెక్కిన రాజకీయాలు

మెదక్​/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,613 సర్పంచ్, 14,098 వార్డు, 681 ఎంపీటీసీ, 72 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ ఖరారు చేశారు. ప్రభుత్వం బీసీలకు  42 శాతం రిజర్వేషన్ కు సంబంధించిన జీ వో విడుదల చేసింది. 

త్వరలో అధికారికంగా రిజర్వేషర్లు ప్రకటించనున్నారు. కుల గణన లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు మారే అవకాశం ఉండడంతో ఏ స్థానం ఎవరికి రిజర్వ్​ అవుతుంది? తమకు అనుకూలంగా వస్తుందా? రాదా? అని ఆయా స్థానాలకు పోటీచేయాలనుకుంటున్న ఆశావహులు చర్చించుకుంటున్నారు.  

సంగారెడ్డి జిల్లాలో పలు స్థానాల్లో మార్పులు..

సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు, 5,370 వార్డులు, 261 ఎంపీటీసీ స్థానాలు, 25 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.  జిల్లాలో ఏర్పడిన కొత్త మండలాలతో పాటు పాత మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. దీంతో పరిషత్ స్థానాల్లో అక్కడక్కడ మార్పులు జరగనున్నాయి. 2019 జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 8 మున్సిపాలిటీలు, 647 గ్రామ పంచాయతీలు ఉండేవి.  కొత్త మండలాలు, పాత మండలాల్లోని పలు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం తర్వాత జిల్లాలో ఇప్పుడు 14 మున్సిపాలిటీలు, 613 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. 

మండలాల్లో మార్పులు లేకపోయినప్పటికీ ఎంపీటీసీ స్థానాల్లో చాలా మార్పులు జరిగాయి. ఆయా మార్పులకు అనుగుణంగా తాజాగా 25 జడ్పీటీసీలు, 261 ఎంపీటీసీ స్థానాలకు ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. గ్రామ పంచాయతీలు కొత్త, పాత మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  

మెదక్​ జిల్లాలో..

మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు, 190 ఎంపీటీసీ స్థానాలు, 21 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు అధికారులు రిజర్వేషర్ల ఖరారు పూర్తి చేశారు. వార్డు మెంబర్​ పదవులకు గ్రామం యునిట్​గా, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండలం యూనిట్​గా, జడ్పీటీసీ పదవులకు జిల్లా యూనిట్​గా రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ   
గోప్యంగా ఉంచారు. ఇదిలా ఉండగా అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టడంతో సర్పంచ్, ఎంపీటీసీ,
జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న రాజకీయ పార్టీల నాయకుల్లో ఏ స్థానం
 ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

సిద్దిపేట జిల్లాలో  హీటెక్కుతున్న పాలిటిక్స్

సిద్దిపేట జిల్లాలో 26 జడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాలుండగా  ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే 10 జడ్పీటీసీ, 96 ఎంపీటీసీ స్థానాలు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. జిల్లాలో 508 గ్రామ పంచాయతీల్లో 4508  వార్డులుండగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలైతే దాదాపు  213 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వయ్యే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు నిర్ణయం తీసుకోనుండగా మహిళా రిజర్వేషన్ల ఖరారుపై రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుండడంతో గ్రామాల్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రిజర్వేషన్ అనుకూలించకుంటే కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే దిశగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు.