మహిళలదే పైచేయి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 చోట్ల అతివలకే అవకాశం

 మహిళలదే పైచేయి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 చోట్ల అతివలకే అవకాశం
  • మొత్తం19 మున్సిపల్ చైర్మన్లు, 410 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు


సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం కల్పించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారీగా మొత్తం 19 మున్సిపాలిటీలు, 410 వార్డులకు శనివారం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈసారి జరిగే బల్దియా ఎన్నికల్లో 19 మున్సిపాలిటీల్లో 12 చోట్ల మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. మిగతా ఏడు స్థానాల్లో చైర్మన్ హోదాలో పురుషులు పాలన అందించనున్నారు. మున్సిపల్ చైర్మన్ స్థానాలతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు కలిసొచ్చిన వారు టికెట్ల కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు అనుకూలించని ఆశావాహులు నిరాశతో తమ రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో 5 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు 2, బీసీలకు 3 సీట్లు రిజర్వ్ కాగా మిగితా 5 స్థానాల్లో 2 స్థానాలు బీసీ జనరల్ కు మరో రెండు స్థానాలు అన్ రిజర్వ్ అయ్యాయి. 263 వార్డులకు సైతం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డుల రిజర్వేషన్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే మాణిక్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చి ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం సీట్లు పెంచాలని కోరారు. 

మెదక్ జిల్లాలో..

మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీ స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 4 మున్సిపల్ చైర్మన్ పీఠాలను పురుషులు అధిష్ఠిం             చగా ఈ సారి నాలుగు చోట్ల మహిళలే చైర్ పర్సన్​లుగా కొనసాగనున్నారు. మెదక్​ మున్సిపాలిటీ చైర్​ పర్సన్​ స్థానం బీసీ మహిళలకు, రామాయంపేట, తూప్రాన్​, నర్సాపూర్​ చైర్​ పర్సన్​ స్థానాలు జనరల్ మహిళకు రిజర్వు అయ్యాయి. ఆయా మున్సిపాలిటీలో మొత్తం వార్డు స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీల ఉండగా ఎన్నికలు జరిగే 4 మున్సిపల్ చైర్మన్, వార్డుల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. చేర్యాల ఎస్సీ మహిళకు, హుస్నాబాద్​ఎస్సీ జనరల్​, గజ్వేల్​ప్రజ్ఞాపూర్​ బీసీ మహిళ, దుబ్బాక బీసీ మహిళకు కేటాయించారు. 72 వార్డులకు సైతం రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. సిద్దిపేట మున్సిపల్ పాలక వర్గం గడువు మరో మూడు నెలలు ఉండగా చైర్మన్ పదవి బీసీ జనరల్ గా రిజర్వ్ చేసినా వార్డుల రిజర్వేషన్ మాత్రం ప్రకటించలేదు. ------ 

ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్  రిజర్వేషన్లు 

 మున్సిపాలిటీ    -   రిజర్వేషన్

సంగారెడ్డి     మహిళ (జనరల్)

సదాశివపేట    మహిళ (జనరల్)

 జహీరాబాద్    బిసి (జనరల్)

కోహిర్    ఎస్సీ (జనరల్)

నారాయణఖేడ్    (అన్ రిజర్వుడ్)

అందోల్-జోగిపేట    (అన్ రిజర్వుడ్)

ఇస్నాపూర్    మహిళ (జనరల్)

ఇంద్రేశం    ఎస్సీ (మహిళ)

గడ్డపోతారం    ఎస్సీ (మహిళ)

 గుమ్మడిదల    బీసీ  (జనరల్)

జిన్నారం    బీసీ (జనరల్)

మెదక్    బీసీ మహిళ

 రామాయంపేట     జనరల్ మహిళ 

తూప్రాన్    జనరల్ మహిళ

 నర్సాపూర్    జనరల్ మహిళ 

 చేర్యాల    ఎస్సీ మహిళ

హుస్నాబాద్    ఎస్సీ జనరల్

గజ్వేల్    బీసీ మహిళ