రెసిడెన్షియల్ ప్లాట్లకు హైదరాబాద్‌లో డిమాండ్.. 2022 నుంచి తగ్గని కొనుగోళ్ల జోరు..

రెసిడెన్షియల్ ప్లాట్లకు హైదరాబాద్‌లో డిమాండ్.. 2022 నుంచి తగ్గని కొనుగోళ్ల జోరు..

దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న వాటిలో హైదరాబాద్ ఒకటి. గడచిన కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయి కంపెనీల రాక హైదరాబాద్ కి పెరగటంతో పెరుగుతున్న ఉపాధి, వృత్తి అవకాశాలు నగర విస్తరణను కోరుకుంటున్నాయి. రుణాల లభ్యత పెరగటంతో చాలా మంది ప్లాట్లు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

తాజాగా రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ అందించిన డేటా ప్రకారం2022 నుంచి మే 2025 మధ్య కాలంలో భారీ సంఖ్యలో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభించబడిన నగరాలుగా హైదరాబాద్, ఇండోర్, బెంగళూరు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా ప్లాటెడ్ డెవలప్మెంట్ కేటగిరీ కొనుగోళ్లు పెంచారు. ఇది పెట్టుబడిదారులకు భవిష్యత్తులో విలువను పెంచటంతో పాటు డెవలపర్లు కూడా వేగంగా అమ్మకాలతో క్యాష్ చేసుకుంటున్నారు. 

ఒకప్పుడు కొనుగోలుదారులు ఎక్కువగా అపార్ట్మెంట్ల వైపు మెుగ్గుచూపారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చేసిన ప్లాట్లను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వేగంగా భూమి ధర పెరగటంతో పాటు అధిక రాబడులు రావటంతో వీటి డిమాండ్ పెరగటానికి ఒక కారణంగా ఉంది. మెుదట్లో తక్కువగా పెట్టుబడి, వేగంగా విక్రయాలతో చేతికి డబ్బు చేరటం, కొనుగోలుదారులకు నచ్చినట్లు ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు వంటి అంశాలు ఈ కేటగిరీ రియల్ ఎస్టేట్ డిమాండ్ పెంచుతోంది.

2022-25 మధ్య కాలంలో దేశంలోని టాప్-10.. టెర్-1, టైర్-2 నగరాల్లో కొత్తగా 4లక్షల 70వేల రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్రాజెక్టులు వచ్చాయి. ప్రధానంగా పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా టౌన్లలో కూడా ప్రజలు భూమిని కలిగి ఉండటం పెట్టుబడిగా భావిస్తున్న తరుణం, దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంగా భూమిని భావించటం వల్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీనికి తోడు వేగంగా నగరీకరణలో కీలక వనరైన భూమి లభ్యత పరిమితంగా ఉండటం ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించే కారణాల్లో ఒకటిగా ఉంది. 

దేశంలోని పది టైర్-1 నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనే 2లక్షల 25వేల ప్లాట్ల ప్రాజెక్టులు పుట్టాయి. ప్రజల నుంచి నిరంతరం పెరుగుతున్న డిమాండ్ ప్రాజెక్టుల లాంచ్ కి దోహదపడుతోందని రియల్టర్లు చెబుతున్నారు. ప్రధానంగా కోయంబత్తూర్, చెన్నై, సూరత్ నగరాలు ఎక్కువ ప్రాజెక్టుల లాంచ్ చూశాయి. 2022 నుంచి ఇప్పటి వరకు లాంచ్ అయిన ప్రాజెక్టుల మెుత్తం విలువ దాదాపు రూ.2లక్షల 44వేల కోట్ల వరకు ఉంటుందని ప్రాప్ ఈక్విటీ సంస్థ అంచనా వేసింది.