లక్షకు ఒక్కరు తక్కువైనా కేసీఆర్ దగ్గర గులాంగిరి చేస్తా

లక్షకు ఒక్కరు తక్కువైనా కేసీఆర్ దగ్గర గులాంగిరి చేస్తా

ఆదివాసీలకు TRS పాలనలో అన్యాయం జరుగుతోందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల్లో దళిత కుటుంబాలను కొనుగోలు చేసేందుకే దళితబంధు పథకమన్నారు. ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవచ్చు.. కానీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని అంచనా వేయలేనివారు కాదన్నారు. TRS నేతలు తోడేళ్లకంటే దారుణంగా దోచుకుంటున్నారని ఆరోపించారు.

 గూడెంలకు వెళ్లేందుకు రోడ్లులేవు, వాళ్ళు ఉండేందుకు ఇండ్లు లేవు మరి బడ్జెట్ లో పెట్టిన 15లక్షల కోట్లు ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక దోపిడికి పాల్పడుతూ బెంజ్ కార్లలో తిరుగుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిందే.. గద్దె దించాల్సిందేనని అన్నారు.

 ఆదివాసీల భూములకు హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఆదివాసీ ఆడబిడ్డలను చెట్టుకట్టేసి కొడుతుంటే సన్నాసి కేసీఆర్ కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. వారు మంచినీళ్లు తాగే బోరు బాయిల్లో బండరాళ్లు వేసి మంచినీళ్లకు దూరం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 119 నియోజకవర్గాలలోని దళిత, గిరిజన బిడ్డలకు పది లక్షలు ఇచ్చేంతవరకు కేసీఆర్ ను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంకా ఆదివాసీల బతుకుల్లో చీకటే ఉందన్నారు. ఆగస్టు 9న చేపట్టనున్న ఛలో ఇంద్రవెల్లిని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దళిత గిరిజనుల సమస్య అన్నారు. లక్ష మంది హాజరై మా సత్తా చూపిస్తామన్నారు. లక్షకు ఒక్కరు తక్కువున్నా నీ దగ్గర గులాం గిరి చేస్తానన్న రేవంత్.. ఇంద్రవెల్లిపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు.

వేలకోట్లు దోచుకుని కేసీఆర్ విదేశాల్లో ఆస్తులు పెంచుకున్నాడన్నారు. నిజాం,రజాకార్ల పై పోరాటం చేసినట్లే కేసీఆర్ పై పోరాటం చేయాలన్నారు.