- ట్యాంక్ బండ్తరహాలో 3 కి.మీ కరకట్ట సుందరీకరణకు గతంలో నిర్ణయం
- మూడు నెలల కింద రూ.25కోట్లు శాంక్షన్
- ప్రారంభం కాని పనులు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మానేరు వాగు బ్యూటిఫికేషన్ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సిద్దిపేట కోమటిచెరువు, వరంగల్ భద్రకాళి చెరువు ట్యాంక్ బండ్ తరహాలో నిర్మించేందుకు అధికారులు ప్రపోజల్స్ పంపారు. మానేరు వాగుపై మూడు కిలోమీటర్ల మేర ట్యాంక్ బండ్ తరహాలో నిర్మించాలని రూ.25 కోట్లు శాంక్షన్ చేసింది. ఫండ్స్ శాంక్షన్ అయి మూడు నెలలు గడిచినా నేటికీ టెండర్లు పిలవలేదు.
మూడు కిలోమీటర్ల మేర కరకట్ట
సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి మధ్య బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కింద ఎదురెక్కిన గోదావరి జలాలతో మానేరు నిండుకుండలా మారింది. మానేరు తీరానికి కుడివైపున బ్రిడ్జి నుంచి బతుకమ్మ ఘాటు నుంచి సాయిబాబా టెంపుల్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించి ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆఫీసర్లు గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో మానేరు వాగు జలకళను సంతరించుకున్నది. దీంతో సిరిసిల్ల పట్టణవాసులు మానేరు తీరానికి వెళ్లి సేదతీరుతున్నారు. ట్యాంక్ బండ్ పనులు కూడా పూర్తయితే టూరిజం పరంగా అభివృద్ధి చెందే అవకాశం
ఉంది.
కలెక్టర్ బదిలీతో ఆగిన పనులు
మానేరు తీరాన్ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ఫండ్స్ శాంక్షన్ చేయడంతో పనులు మొదలుపెట్టేందుకు అధికారులు రెడీ అయ్యారు. కాగా వివిధ ఆరోపణలతో అప్పటి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో ఎం.హరిత వచ్చారు. ఆమె నెల రోజుల తర్వాత లీవ్ లో వెళ్లారు. ప్రస్తుతం గరిమా అగ్రవాల్ ఇన్ చార్జి కలెక్టర్గా కొనసాగుతున్నారు. కరకట్ట నిర్మాణ పనులపై కలెక్టర్ దృష్టి సారించి, పనులు చేపట్టాలని పట్టణ వాసులు
కోరుతున్నారు.
నిధులు ఉన్నా పనులు ప్రారంభించడం లేదు
మానేరు తీరం అభివృద్ధికి నిధులు ఉన్నా అధికారులు పనులు ప్రారంభించడం లేదు. వెంటనే టెండర్లకు పిలిచి పనులు మొదలుపెట్టాలి. మానేరు తీరం సిరిసిల్ల పట్టణానికి గుండెకాయ వంటిది. బతుకమ్మ ఘాటు వద్ద ట్యాంక్ బండ్ నిర్మిస్తే పర్యాటక కేంద్రంగా మారుతుంది. మానేరు తీరాన్ని అందంగా తీర్చిదిద్దితే పట్టణ వాసులకు ఆహ్లాదం దొరుకుతుంది. -అన్నల్దాస్ వేణు,సిరిసిల్ల పట్టణ వాసి
