- మీర్ పేట్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ అరెస్ట్
ఎల్ బీనగర్,వెలుగు: ఫేక్ డాక్యుమెంట్ తో మోసగించిన కార్పొరేటర్ అరెస్ట్ అయ్యారు. మీర్ పేట్ పోలీసులు తెలిపిన ప్రకారం. చంపాపేట్ కు చెందిన చిత్తోజు కృష్ణను మీర్ పేట కార్పొరేషన్ 13 వ డివిజన్ కార్పొరేటర్ నరేందర్ కుమార్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని నమ్మించాడు. దీంతో రూ.7కోట్లు పెట్టేందుకు కృష్ణ రెడీ అయి.. మొదట రూ.5 కోట్లు చెల్లించాడు.
దీంతో రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ కు చెందిన తుమ్మల ధీరజ్ రెడ్డి, తోట మాధవ రెడ్డి, గుండు శ్రీకాంత్ కు చెందిన 6 .17 ఎకరాల భూమిని చిత్తోజు కృష్ణ, బొడ్డుపల్లి సతీష్ కుమార్, నరేందర్ కుమార్ పై సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసినట్లుగా.. ఫేక్ డాక్యుమెంట్లను కార్పొరేటర్ సృష్టించి నమ్మించాడు. ఆ తర్వాత భూమి రిజిస్ట్రేషన్ పై అడుగగా పలుమార్లు వాయిదా వేశాడు.
ఆ భూమి వద్దకు కృష్ణ వెళ్లి తెలుసుకోగా ఎవరికి అమ్మలేదని యజమానులు తెలిపారు. దీంతో నరేందర్ మోసం చేశాడని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు కృష్ణ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన కార్పొరేటర్ నరేందర్ ను అరెస్ట్ చేశారు. బీజేపీ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన నరేందర్ అనంతరం బీఆర్ఎస్ లో చేరాడు. లోక్ సభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లాడు.