కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి రూ.9 వేల కోట్ల లోన్‌

  కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి రూ.9 వేల కోట్ల లోన్‌
  •     ఇందులో రూ.13 వేల కోట్లు నిర్వహణకే
  •     కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి రూ.9 వేల కోట్ల లోన్‌

హైదరాబాద్‌, వెలుగు: అప్పు చేయకుండా సాగునీటి ప్రాజెక్టుల నీళ్లు పారే పరిస్థితి కనిపించడం లేదు. రూ.22,675 కోట్లతో భారీ పద్దు బడ్జెట్‌లో పెట్టినా అందులో ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేస్తామంటున్నది రూ.9,277.16 కోట్లే. మిగతా రూ.13,398 కోట్లు లోన్‌ల రీపేమెంట్‌లు, కరెంట్‌ బిల్లులు, శాఖ నిర్వహణకే ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి కొత్తగా ఇంకో రూ.9 వేల కోట్ల అప్పు తీసుకోవాలని ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కాగా కొద్ది మొత్తం కేటాయింపుతోనే సరిపెట్టారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టు గురించి బడ్జెట్‌లో గొప్పగా చెప్పినా.. పూర్తి చేయాలంటే మాత్రం ఇంకా రూ.32 వేల కోట్లకుపైగా ఖర్చు చేయాలి. నిరుటితో పోల్చితే కొద్దిగా కేటాయింపులు పెరిగినా కొన్ని ప్రాజెక్టులకు ఉన్న పెండింగ్‌ బిల్లులకన్నా తక్కువగానే కేటాయింపులు చేశారు.

రూ.22,675 కోట్ల ఇరిగేషన్‌ పద్దులో మేజర్‌, మీడియం ఇరిగేషన్‌కు రూ.21,401.08 కోట్లు, మైనర్‌ ఇరిగేషన్‌కు రూ.1,245.30 కోట్లు, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌కు రూ.18.69 కోట్లు, ఫ్లడ్‌ కంట్రోల్‌కు రూ.10 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దులో ప్రతిపాదించిన రూ.14,900 కోట్లల్లో రూ.9 వేల కోట్ల వరకు లోన్‌ల రీపేమెంట్‌కు ఖర్చు చేయనున్నారు. రూ.5 వేల కోట్ల వరకు కరెంట్‌ బిల్లులు, ప్రాజెక్టుల నిర్వహణకు వెచ్చిస్తారు. నిరుడు బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు రూ.16,931 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.17,331 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో అప్పుల ద్వారా వెచ్చించిన మొత్తమే ఎక్కువ. రాష్ట్రంలో మూడో అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్తున్న సీతారామ పూర్తి చేయడానికి లోన్‌లపై ఆధారపడాల్సిందే. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన లిఫ్టులు, ఇతర పథకాలకు సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్‌లు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప నిధులు ఇవ్వడానికి సర్కారుకు చేతులు రాలేదు. బడ్జెట్‌లో పెట్టిన కొద్ది మొత్తం దాని కరెంట్‌ బిల్లులకు సరిపోని పరిస్థితి.