రష్యా: స్కూల్ లో కాల్పులు.. 11 మంది మృతి

 రష్యా: స్కూల్ లో కాల్పులు.. 11 మంది మృతి
  • తుపాకీ గుళ్లకు నేలకొరిగిన 9 మంది చిన్నారులు 
  • తప్పించుకునేందుకు బిల్డింగ్ 3వ అంతస్తు నుంచి దూకిన ఇద్దరు మృతి

మాస్కో: రష్యాలోని కజన్ పట్టణంలోకి ఓ స్కూలులో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. జౌడాటా ఫైజీ స్ట్రీట్‌లోని స్కూల్‌లో ప్రవేశించిన ఇల్నాజ్ గాల్యాలియేవ్ అనే 19 ఏళ్ల పూర్వ విద్యార్ధిని ఈ కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా తెలిపింది. తుపాకీ గురిపెట్టి కాల్పులు జరుపుతున్నప్పుడు పిల్లలు భయంతో పరుగులు తీశారు. ఇద్దరు విద్యార్థులు కాల్పుల నుండి తప్పించుకునేందుకు బిల్డింగ్ పైన మూడో అంతస్తు నుంచి దూకేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో విలవిలలాడుతూ కన్నుమూశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రక్తం ఏరులై పారింది
తుపాకీ కాల్పులతో పాఠశాల ఆవరణం అంతా రక్తం ఏరులై పారింది. పూర్వ విద్యార్థిని ఎవరూ ఊహించని రీతిలో తుపాకీతో స్కూల్లోకి వచ్చి రావడంతోనే కాల్పులకు తెగబడింది. దీంతో స్కూల్లోని చిన్నారులు హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. కొంత మందికి ఏం జరిగిందో అర్థం కాక ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దుశ్చర్యతో అమాయకులైన 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు చిన్నారులైతే ప్రాణభయంతో కాల్పుల నుంచి తప్పించుకునేందుకు స్కూల్ భవనం మూడో అంతస్తు పై నుంచి దూకారు. కాళ్లు, చేతులు విరిగి తీవ్ర స్రావం కావడంతో కొద్దిసేపటికే మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. రష్యాలోని కజాన్‌ పట్టణంలో చోటుచేసుకున్న ఘటన విషాదంలో ముంచెత్తింది. విషయం తెలిసిన వెంటనే పాఠశాలకు భద్రతా దళాలు చేరుకున్నాయి. మృతదేహాలను, గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన ఆమె ఎందుకు కాల్పులకు పాల్పడిందనే విషయం తెలియాల్సి ఉంది.