
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు స్వరాజ్య వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సీఎం, మంత్రులు పర్యటించి, ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారని, కానీ ఇంకా రైతులకు రూపాయి కూడా అందలేదని చెప్పింది. పంట నష్టంపై సర్కారు నిర్వహించిన సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని తమ అధ్యయనంలో తేలిందని రైతు స్వరాజ్య వేదిక పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాకు సంబంధించి కేంద్రం ఏటా నిధులు ఇస్తున్నా అవి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వడం లేదని విమర్శించింది. ‘‘రాష్ట్రంలో 2020 నుంచి పంటల బీమా పథకం అమలు కాకపోవడంతో రైతులకు పరిహారం అందడం లేదు. వెంటనే పంటల బీమాను ప్రవేశపెట్టాలి” అని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ప్రకృతి వైపరీత్యాలు.. పంట నష్టాలు.. పంటల బీమా అవసరం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సోషల్ డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షుడు ఆకునూరి మురళి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నేత కోదండరెడ్డి, ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు స్వరాజ్యవేదిక కన్వీనర్ విస్సా కిరణ్, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాలు పెంచి తడిసిన ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. పంట నష్ట పరిహారం ఇవ్వాలంటూ కోర్టులు చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా మూడేండ్లలో దాదాపు రూ.56 వేల కోట్ల పంట నష్టం జరిగిందన్నారు.
సెక్రటేరియెట్‌కు వెళ్తుండగా నేతల అరెస్ట్
సమావేశం తర్వాత రైతు సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు సెక్రటేరియెట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కోదండరాం, ఆకునూరి మురళి, విస్సా కిరణ్‌తోపాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, రైతులు నష్టపోయారని తెలిపారు. వెంటనే వారికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మురళి మాట్లాడుతూ.. పంట నష్టంపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన అంశాలను లెటర్ రూపంలో వ్యవసాయ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సెక్రటేరియెట్‌కు వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రైతుబంధు ఒక్కటి ఇచ్చి.. రైతు సమస్యలను దుప్పటి కింద దాచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిమాండ్లు ఇవీ
- 45 రోజులుగా భారీ వర్షాలు, వడగండ్ల వానలతో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులందరికీ ఎకరానికి రూ.10 వేలు పరిహారం కింద చెల్లించాలి.
- నష్టపోయిన కౌలు రైతులను నమోదు చేసి, వారి అకౌంట్లలోకి డబ్బులు వేయాలి.
- తడిసిన ధాన్యాన్ని కొనాలి.. ధాన్యం సేకరణ కేంద్రాలు పెంచాలి.
- 2023 వానాకాలం నుంచి పంటల బీమా అమలుకు నోటిఫికేషన్ విడుదల చేయాలి.