
- ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళలు దేవాలయాలు, చౌరస్తాలు, పాఠశాలలు, చెరువుల సమీపంలోని ఆట స్థలాల వద్ద బతుకమ్మ ఆడిపాడారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆట, పాటలతో పూజించారు. పలు గ్రామాల్లో డీజే సాంగ్స్ పెట్టుకొని మహిళలు బతుకమ్మను పాటలతో కోలలతో నృత్యాలు చేశారు.
ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకమ్మ ఆటలను వృద్ధులు, చిన్నారులు సైతం ఆడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను విడిచిపెట్టి పోయిరా బతుకమ్మ మళ్లీరా అంటూ వేడుకున్నారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా, వేడుకల సందర్భంగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యుత్ దీపాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. - వెలుగు, నెట్వర్క్